logo

దృష్టి సారిస్తేనే.. జలాశయం నెరవేరు

నల్లవాగు జలాశయం కాలువలు, సిమెంట్‌ కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరు సరఫరా కావడంలేదని అయిదేళ్లక్రితం కాల్వల ఆధునికీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Updated : 08 Feb 2023 07:24 IST

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌, కల్హేర్‌: నల్లవాగు జలాశయం కాలువలు, సిమెంట్‌ కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరు సరఫరా కావడంలేదని అయిదేళ్లక్రితం కాల్వల ఆధునికీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే గుత్తేదారు సకాలంలో పనులు చేపట్టకపోవడం, చేసిన వాటికి బిల్లులు చెల్లింపులో జాప్యం వల్ల అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు పారక రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. కుడికాలువ కింద 4,100, ఎడమ కాలువ కింద 1,230 ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే అక్విడెక్టులు, తూములు, శిథిలావస్థకు చేరడంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు.2008-09లో రూ.14కోట్లు కేటాయించడంతో కాలువలకు సీసీ లైనింగ్‌ పనులు చేపట్టారు. అయితే అప్పట్లో గుత్తేదారు సీసీ లైనింగ్‌ పనులు చేపట్టినా, కట్టడాలను వదిలి వేయడంతో నిధులు నిరుపయోగమయ్యాయి. పనులు నాసిగా ఉండటంతో 2010లో లైనింగ్‌ కొట్టుకు పోయింది. ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది.

అయిదేళ్ల కిందట: నల్లవాగు ప్రాజెక్టు కాలువల దుస్థితి అధ్వానంగా మారడం, చేపట్టిన పనులు నాసిరకంగా మారడంతో ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రైతుల పరిస్థితి, కాల్వల దుస్థితిని అయిదేళ్లకిందట శాసనసభలో ప్రస్తావించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరున్నా, చివరి ఆయకట్టుకు చేరకపోవడంతో రైతుల దుస్థితిని వివరించారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.24.14 కోట్లు కేటాయించింది. 2017లో పనులు ప్రారంభించారు. గడువు తీరినా, గతేడాది జూన్‌ వరకు పొడిగించగా అప్పటి వరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయి. అనంతరం నిలిచిపోయాయి. కేటాయించిన నిధుల్లో గతేడాది బడ్జెట్లో రూ.10.10 కోట్లు విడుదల చేయగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.15.54 కోట్లు కేటాయించారు.

వెంటనే ప్రారంభిస్తేనే ప్రయోజనం

గత అయిదేళ్లలో 60 శాతం పనులు మాత్రమే పూర్తికాగా దాదాపు రూ.12 కోట్ల వరకు చెల్లింపులు జరిపినట్లు సమాచారం. వీటిని పూర్తి చేసేందుకు ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పనులు ప్రారంభిస్తే వచ్చే వర్షా కాలానికి పూర్తయి ఆయకట్టు మొత్తానికి నీరందించే అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని