logo

నియంత్రికలపై భారం.. అదనంగా సిద్ధం

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే మార్చి, ఏప్రిల్‌, మేలో ఎండల తీవ్రత అధికం కానుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వ్యవసాయానికి, గృహ, వాణిజ్య ఇతరత్రా అవసరాలకు జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశం ఉంది.

Published : 08 Feb 2023 02:03 IST

వేసవిలో నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌

సిద్దిపేటలో అందుబాటులో నియంత్రికలు

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే మార్చి, ఏప్రిల్‌, మేలో ఎండల తీవ్రత అధికం కానుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వ్యవసాయానికి, గృహ, వాణిజ్య ఇతరత్రా అవసరాలకు జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 7.6 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. సరఫరాకు ఎలాంటి అవరోధాలు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో బోరుబావుల కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా అన్నదాతలు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశారు. వరి పంట ప్రస్తుతం పిలక దశలో ఉంది. రానున్న రోజుల్లో వరికి ఎక్కువ నీరు పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఆ మేరకు విద్యుత్తు వినియోగంపై ప్రభావం పడుతుంది. మొత్తం 5.24 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా వీటిలో 1.54 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. రానున్న రెణ్నెల్లలో రోజుకు 11 మిలియన్‌ యూనిట్లు దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

కనెక్షన్లకు దరఖాస్తులు

జిల్లాలో నూతన వ్యవసాయ విద్యుత్తు నియంత్రికల మంజూరుకు 2022-23 సంవత్సరంలో 1823 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అధికారులు 1528 నియంత్రికలను మంజూరు చేశారు. 315 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన వాటికి త్వరలోనే మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. ఈ నియంత్రికలకు మొత్తం రూ.6.11 కోట్లు ఖర్చయింది.

రూ.8 కోట్లు మంజూరు

విద్యుత్తు అధికంగా వినియోగించే సమయంలో నియంత్రికలపై భారం పడకుండా ఉండేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. 33/11 కేవీ ఉపకేంద్రాల, విద్యుత్తు నియంత్రికల స్థాయి పెంచుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారు. వీటికి తోడుగా అవసరమైన చోట్ల అదనపు నియంత్రికలు ఏర్పాటు చేస్తారు. పలుచోట్ల నూతనంగా నిర్మించిన 33/11 కేవీ ఉపకేంద్రాలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇప్పటికే మొత్తం 35,600 నియంత్రికలు ఉన్నాయి. మరమ్మతులకు గురి కాగానే వెనువెంటనే వాటి స్థానంలో కొత్తవి బిగించేందుకు కేంద్రాల్లో 1424 నియంతిక్రలను ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, పంటలు ఎండకుండా పాతవాటి స్థానంలో కొత్తవి బిగించడానికి రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి.


30 శాతం పెరిగే సూచన
- మహేశ్‌కుమార్‌, విద్యుత్తు శాఖ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈ

వేసవి నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతుంది. సాగు అధికమైనందున గతేడాదితో పోల్చితే 30 శాతం అదనంగా విద్యుత్తు వినియోగం పెరగవచ్చు. రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపకేంద్రాలు, నియంత్రికల స్థాయిని పెంచుతూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు