logo

సాంకేతిక వేడుక.. సృజనకు వేదిక

ఐఐటీలో చదవాలన్నది ఎంతో మంది విద్యార్థుల కల. ఇందులో సీటు దొరికిందంటే ఉజ్వల భవితకు బాటలు పడినట్లే. ఇంతటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చేరాలని ఎంతోమంది ఆశపడినా కొందరికే అవకాశం దక్కుతుంది.

Published : 08 Feb 2023 02:03 IST

ఈనెల 17 నుంచి ఐఐటీలో ఎలాన్‌- ఎన్‌విజన్‌
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ఐఐటీలో చదవాలన్నది ఎంతో మంది విద్యార్థుల కల. ఇందులో సీటు దొరికిందంటే ఉజ్వల భవితకు బాటలు పడినట్లే. ఇంతటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చేరాలని ఎంతోమంది ఆశపడినా కొందరికే అవకాశం దక్కుతుంది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ - హైదరాబాద్‌లో విద్యార్థులు.. ఆచార్యుల సహకారంతో ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలపై పరిశోధనలు సాగిస్తున్నారు. ప్రజలకు దోహదపడేలా ఎన్నింటినో ఆవిష్కరించారు. ఆయా వివరాలు తెలియజేయడంతో పాటు విద్యార్థుల ప్రతిభ చాటేందుకు ‘ఎలాన్‌-ఎన్‌ విజన్‌’ వేదికగా మారింది. ఈనెల 17 నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి.

ఆధునిక పరిజ్ఞానం..

ఎలాన్‌ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. సీక్రెట్స్‌ ఆఫ్‌ వాలిన్‌రో అనే థీమ్‌ను ఎంచుకున్నారు. ఇక్షానా-జంతువులను రక్షించండి అంటూ సామాజిక అంశాన్ని సైతం ఎంచుకున్నారు. సాంకేతికపరంగా ఐఐటీలో జరుగుతున్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు అద్దంపడతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవచ్చో ప్రయోగాత్మకంగా వివరించనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఇందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేస్తారు. మూడు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తారు.

విద్యార్థులే నిర్వాహకులు

విద్యార్థులే స్వయంగా నిర్వహించే వేడుక ఎలాన్‌. బృందాలుగా ఏర్పడి విధులు నిర్దేశించుకుంటారు. ఆహూతుల ఆహ్వానం, పోటీల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, వివిధ కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు వసతులు, కళా ప్రదర్శనలు.. ఇలా అన్ని కార్యక్రమాలను వారే పర్యవేక్షిస్తారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు. వేలాది మంది ఒక్కచోట చేరడం సందడిమయం అవుతుంది. ఎక్కడా చిన్నపాటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం ఐఐటీయన్ల ప్రత్యేకత.

నిధులు సమకూర్చుకొని..

ఎలాన్‌ కార్యక్రమం నిర్వహణకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుంది. ఇందుకు వేడుకల ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే విద్యార్థులు స్పాన్సర్లను సమీకరించే పనిలో నిమగ్నమవుతారు. పరిశ్రమలు, సంస్థలను సంప్రదిస్తుంటారు. నిధులు సేకరించడంతో ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. డబ్బు వినియోగంలో పారదర్శకత పాటిస్తారు.

ఇతరులకు ప్రోత్సాహం

ఇతర కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం ఐఐటీయన్లు ప్రోత్సహిస్తుంటారు. సాంకేతిక, సాంస్కృతిక విభాగాల్లోనూ వివిధ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఐఐటీ ఆవరణలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు.

ఎలాన్‌-ఎన్‌ విజన్‌ వేడుకల లోగో


నైపుణ్య ప్రదర్శన

ఎలాన్‌-ఎన్‌ విజన్‌ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను చాటేందుకు వేదికగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా పాల్గొననున్నారు. ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భావసారూప్యత గల వారితో సంభాషణకు అవకాశం ఉంటుంది. ఆవిష్కరణల స్ఫూర్తిని ఐఐటీహెచ్‌ ప్రోత్సహిస్తోంది.

ప్రొఫెసర్‌ బి.ఎస్‌ మూర్తి, డైరెక్టర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని