logo

దృష్టి సారిస్తేనే.. పుష్టి!

చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో గుడ్డు అందిస్తున్నారు. వారానికి మూడు రోజులు భోజనంలో వీటిని ఇవ్వాలనే నిబంధన ఉంది.

Published : 09 Feb 2023 01:59 IST

20,916 మంది చిన్నారులకు అందని గుడ్డు
న్యూస్‌టుడే, మెదక్‌, హవేలిఘనపూర్‌, శివ్వంపేట

హవేలిఘనపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో..

చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో గుడ్డు అందిస్తున్నారు. వారానికి మూడు రోజులు భోజనంలో వీటిని ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే స్థానికంగానే వంట చేసే చోట సమస్య లేదు. అక్షయపాత్ర ద్వారా సరఫరా చేసే పాఠశాలల్లో మాత్రమే ఈ పరిస్థితి నెలకొంది. పలుప్రాంతాల్లో వంట నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో, అక్షయపాత్రకు భోజన బాధ్యతలు అప్పగించారు. వీరు గుడ్డు సరఫరా చేయకపోవడంతో, చిన్నారులు పోషక ఆహారానికి దూరం అవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం...
విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 898 సర్కారు పాఠశాలల్లో 88,919 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఆరు రోజుల పాటు భోజనాన్ని అందిస్తున్నారు. నిత్యం వివిధ రకాల కూరగాయలతో చేసిన కూరలను వడ్డిస్తున్నారు. కరోనాతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం గిట్టుబాటు కాకపోవడంతో చాలా చోట్ల వంట ఏజెన్సీలు ముందుకు రాలేదు. దీంతో పలు పాఠశాలలకు అక్షయపాత్ర ద్వారా భోజనం సరఫరా అవుతోంది. సాధారణంగా మధ్యాహ్న భోజనం వడ్డించే నిర్వాహకులు వారానికి మూడు సార్లు ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అందజేస్తున్నారు. అక్షయపాత్ర భోజనం వెళ్లే పాఠశాలల్లో ఇవ్వడంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్డు ఉడికించి ఇవ్వమని చెబుతున్నారు. కేవలం పప్పుచారు, ఒక కూర మాత్రమే అందిస్తున్నారు.

రూ.12.54 లక్షలు వాడుకోలేని పరిస్థితి

జిల్లాలోని 113 ప్రభుత్వ పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా భోజనం సరఫరా అవుతోంది. ఈ పాఠశాలల్లో 20,916 మంది విద్యార్థులున్నారు. నెలకు ఒక్కో విద్యార్థికి 12 అందుతాయి. వీటిని సరఫరా చేసేవారికి ఒక్కో దానికి రూ.5 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ లెక్కన ఒక విద్యార్థిపై నెలకు రూ.60 ఖర్చు పెడుతుంది. విద్యార్థులందరికి ఈ మొత్తం రూ.12.54 లక్షలకు చేరుతుంది. అక్షయపాత్ర ద్వారా గుడ్డు ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయంగా వేరే మార్గాల ద్వారా దీనిని అందించకపోవడంతో ఈ డబ్బును జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

గుడ్డు లేని భోజనం

ప్రత్యామ్నాయం లేదు..అక్షయపాత్ర నిర్వాహకులు గుడ్డు బదులు ఇది వరకు స్వీటు అందజేసేవారు. గత కొన్ని రోజులుగా అది కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ బడుల్లో కోడిగుడ్లు ఉడికించేందుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. బిల్లుల జాప్యం, తక్కువ డబ్బులు చెల్లిస్తుండటంతో చాలా మంది వంట చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.


శాకాహారం మాత్రమే సరఫరా చేస్తారు

- రమేశ్‌కుమార్‌, డీఈవో

మధ్యాహ్నభోజన నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో అక్షయపాత్ర ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనాన్ని అందిస్తున్నాం. వారు సేవాధృక్పథంతో ముందుకు వచ్చారు. పూర్తిగా శాకాహారం మాత్రమే సరఫరా చేస్తామన్నారు. గుడ్డుకు బదులు అరటిపండు, పల్లిపట్టి, స్వీటు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు