logo

పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం తగదు

మనఊరు-మనబడి ద్వారా ఎంపికచేసిన పాఠశాలల్లో రూ.30లక్షలలోపు చేపట్టిన పనులను సత్వరం పూర్తి చేయాలని పాలనాధికారి రాజర్షిషా ఆదేశించారు.

Published : 09 Feb 2023 01:59 IST

పాలనాధికారి రాజర్షిషా

మాట్లాడుతున్న పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: మనఊరు-మనబడి ద్వారా ఎంపికచేసిన పాఠశాలల్లో రూ.30లక్షలలోపు చేపట్టిన పనులను సత్వరం పూర్తి చేయాలని పాలనాధికారి రాజర్షిషా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల్లో ఐదు పాఠశాలలలోపు పనులు ఉంటే వాటిని ఈనెలాఖరులోగా, ఆపై ఉన్నవాటిని ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి, నివేదిక అందజేయాలన్నారు. నిధుల కొరత లేదని, చేసిన పనికి ఎప్పటికప్పుడు ఎంబీ రికార్డు చేసి, ఎఫ్‌టీవో పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి కలెక్టర్‌ లాగిన్‌కు పంపాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు పగుళ్లు మూసివేసి, ప్రైమరీ, చివరిగా రంగులు వేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

జిల్లాల్లో ముగింపు దశలో ఉన్న 1,600 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని పాలనాధికారి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలపై తహసీల్దార్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, గుత్తేదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పదిమండలాల్లో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉపాధి పథకం ద్వారా సీసీ రహదారులు, మురుగు కాలువ పనులను చేపట్టాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని సూచించారు. ఇప్పటి వరకు పట్టాలు అందజేసిన 1,234 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఒప్పందంలో నిబంధనల మేరకు సకాలంలో పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు చెప్పారు. సమావేశాల్లో అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ సత్యనారాయణరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈ శ్రీనివాస్‌రావు, డీఈవో రమేశ్‌కుమార్‌, డీఎస్‌వో శ్రీనివాస్‌, డీఈఈ వెంకటేశం, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని