logo

కొత్త డిపో ఆదాయం.. తద్వారా ఆదర్శం

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ డిపోను నర్సాపూర్‌లో ప్రారంభించారు. ఎనిమిది నెలల్లోనే ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు పొందుతోంది.

Published : 09 Feb 2023 01:59 IST

డి…పోలోని ప్రధాన షెడ్డు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ డిపోను నర్సాపూర్‌లో ప్రారంభించారు. ఎనిమిది నెలల్లోనే ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు పొందుతోంది. ఆదాయపరంగా హైదరాబాద్‌ జోన్‌లో 8వ స్థానంలో నిలిచింది. సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా డిపోలో బస్సుల సంఖ్యను పెంచనున్నారు. ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థానికంగా డిపో రావాలనే మూడు దశాబ్దాల కల సాకారమై ప్రస్తుతం 22 బస్సులతో కొనసాగుతోంది. వంద మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. కండక్టర్లు, చోదకులు, మెకానిక్కులు, పర్యవేక్షకులు, కాపలదారులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. ఐదు ఎకరాల విశాలమైన ఆవరణలో డిపో ఏర్పాటైంది. ఒకేసారి ఆరు బస్సులను మరమ్మతులు చేయగలిగే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. సిబ్బంది అంతా బృందంగా సమన్వయంతో డిపో ఆదాయం క్రమంగా పెరగడానికి శ్రమిస్తున్నారు. రోజుకు రూ.3.10 లక్షల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని ఇప్పటికి పది సార్లు అధిగమించారు. ఇక్కడ బస్సు డిపోతో పాటు పెట్రోలు బంకును సైతం నిర్వహిస్తున్నారు. తద్వారా రోజూ రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు రూ.కోటికి పైగా ఆదాయం వివిధ రూపాల్లో సమకూరుతోంది. హైదరాబాద్‌ జోన్‌లోని 38 డిపోలలో ఆదాయంలో నర్సాపూర్‌ డిపో 8వ స్థానంలో ఉంది. గతంలో మూడో స్థానం వరకూ ఒకసారి చేరుకుంది. నర్సాపూర్‌ నుంచి శ్రీశైలం, జోగిపేట, పటాన్‌చెరు, అజ్జమర్రి, వెల్దుర్తి... విద్యార్థుల కోసం గోమారం, జక్కపల్లి, గుండ్లమాచనూరు, నల్లవల్లి, కొత్తపల్లి, అల్లీపూర్‌ తదితర మర్గాల్లో బస్సులు నడుపుతున్నారు. మరో వంద బస్సులు నిలపడానికి డిపోలో స్థలం ఉంది. యాదగిరిగుట్ట, పటాన్‌చెరు, కౌడిపల్లి, జోగిపేట మార్గంలో నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిపో బాధ్యుడు నరేందర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని