logo

కంకర క్రషర్లు..కాలుష్య కేంద్రాలు!

కంకర క్రషర్ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Published : 13 Feb 2023 02:11 IST

ఇళ్లు, పొలాలపై దుమ్ము, ధూళి

ఖాజీపల్లిలో పరిసరాలు ఇలా..

కంకర క్రషర్ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధిక లోడు వాహనాలతో రహదారులు శిథిలమవడం, క్రష్లర్ల దుమ్ము, ధూళి, రాతి పొడి.. ఇళ్లు, పంట పొలాలపైకి చేరుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా చోదకులు కంకర, రాతి పొడిని తరలిస్తుండటమూ సమస్యగా మారింది. గత నెలలో జరిగిన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఈ అంశంపై చర్చించినా.. ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కథనం.


అందోలు నియోజకవర్గంలో..

కంకర క్వారీల కారణంతో అందోలు, పుల్కల్‌, చౌటకూరు మండలాల్లోని పలు గ్రామాల రహదారులు గుంతలమయంగా మారాయి. అందోలు మండలం సంగుపేట శివారులో, చౌటకూరు మండలం శివ్వంపేట, పుల్కల్‌ కూడలికి సమీపంలో క్వారీలు నిర్వహిస్తున్నారు. వీటి నుంచి నిత్యం పదులు సంఖ్యలో అధిక లోడు టిప్పర్లు ప్రధాన రదారులపై వెళుతున్నాయి. అంగడిపేట, ఎస్‌.ఇటిక్యాల, సంగుపేట, మాసానిపల్లి, పోతిరెడ్డిపల్లి, గొంగ్లూర్‌ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దారులు అధ్వానంగా మారడంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


తండావాసుల గోడు వినే వారేరి?

కంది మండలంలో ఎర్దనూరు, ఎర్దనూరు తండా, బ్యాతోల్‌ తండా, బేగంపేట తండా సమీపంలో కంకర క్రషర్లు ఉన్నాయి. తండాలకు సమీపంలోనే వీటిని నిర్వహిస్తుండంతో క్రషర్ల దుమ్ము, రాతిపొడి ఇళ్లపై, పంట పొలాలపై పడుతోంది. పంటలు బెబ్బతింటున్నాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. రాతిపొడి తరలింపు సమయంలో చోదకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో దుమ్ము, పొడి ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిపై పడుతోంది. పలుసార్లు ఆయా తండాల ప్రజలు ఆందోళనలు చేసినా.. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు లేవు.

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కంది, జోగిపేట, జిన్నారం


పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు

జిన్నారం మండలం ఖాజీపల్లి, మాదారం, రాళ్లకత్వ గ్రామాల్లో 16 క్రషర్లు ఉన్నాయి. కంకర, దుమ్మను టిప్పర్లలో తరలించడం వల్ల సమీప గ్రామాల వాసులు  అవస్థలు పడాల్సి వస్తోంది. పరిమితికి మించి రాతిపొడి, కంకర తరలిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రషర్ల నిర్వహణ తీరువల్ల చాలా గ్రామాల్లో పంటల  సాగుకు అన్నదాతలు దూరమయ్యారు. పేలుళ్లు తీవ్రంగా ఉంటుండటంతో భూమి కంపించినట్టుగా అవుతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. క్రషర్ల ఏర్పాటును ఈ ప్రాంత  ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు

నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. వాహనాలల్లో కంకర, రాతిపొడి తరలించేటప్పుడు వాహనాలపై టార్పాలిన్లు కప్పాలి. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. క్రషర్ల పొడి ఇళ్లు, పంట పొలాలపై పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

మధుకుమార్‌, ఇన్‌ఛార్జి ఏడీ, మైనింగ్‌ శాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు