logo

11ఏళ్ల చిన్నారి అధ్యాయాల సాహస కథ

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నా పేరు జి.అన్షిత. అమ్మానాన్నలు లావణ్య, భీమేశ్‌. ఇద్దరూ వైద్యులే. ఏడేళ్లున్న తమ్ముడు సంహిత్‌ ఉన్నాడు. సిద్దిపేటలోని ఆంబిటస్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా. 

Published : 21 Mar 2023 02:17 IST

పుస్తకం ఆవిష్కరణ

అడ్వెంచర్‌ ఆఫ్‌ రోజి అండ్‌ సెంటర్‌ పుస్తకం

న్యూస్‌టుడే, సిద్దిపేట: హాయ్‌ ఫ్రెండ్స్‌.. నా పేరు జి.అన్షిత. అమ్మానాన్నలు లావణ్య, భీమేశ్‌. ఇద్దరూ వైద్యులే. ఏడేళ్లున్న తమ్ముడు సంహిత్‌ ఉన్నాడు. సిద్దిపేటలోని ఆంబిటస్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా.  కథలు రాయడమంటే ఇష్టం. దీంతో నేనూ అటు వైపు అడుగేశా. నేను 2011 జూన్‌ 11న జన్మించాను. నేను రాసిన కథలో అధ్యాయాలు (ఛాప్టర్లు) కూడా 11. కథలో రోసి వయసు కూడా 11. నన్ను నేను రోసిలా ఊహించుకొని ‘ది అడ్వెంచర్‌ ఆఫ్‌ రోజి అండ్‌ సెంటర్‌’ పేరిట ఆంగ్ల భాషలో కథలు రాయడం (సిరీస్‌) మొదలెట్టా. ఇందులో మొదటిదే ‘ది అడ్వెంచరస్‌ దౌ ద ప్లానెట్‌ ఆఫ్‌ సర్కులస్‌’. 85 పేజీలు ఉంటాయి. దీన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సాహస కథలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి.

ఆరు నెలల కిందట..

పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఏదైనా సాధించవచ్చు. వివిధ రకాల కథలు, ఇతరత్రా పుస్తకాలు.. మూడో తరగతి నుంచే చదవడం ప్రారంభించా. తరచూ చదవడంతో రాసే శైలి అబ్బింది. నా వద్ద 50 వరకు పుస్తకాలు ఉన్నాయి. ఆరు నెలల కిందట స్వయంగా రాయడం మొదలెట్టా. సిరీస్‌లో భాగంగా మరిన్ని కథలు రాస్తా. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు కొంత సహకారం అందించారు. పాఠశాల నిర్వాహకుల సాయంతో పుస్తకాన్ని ప్రచురించాం. నాలుగో తరగతి నుంచే రెండు యూట్యూబ్‌ ఛానెళ్లు నిర్వహిస్తున్నా. బార్బీ డాల్స్‌తో పాటు సబ్జెక్టులు బోధిస్తూ వీడియోలుగా రూపొందించి ఛానెల్‌లో పోస్టు చేస్తున్నా. అన్నట్లు చదువులోనూ నేను ముందంజే.

కథలోకి వెళితే..

శాపానికి గురైన ఓ అందమైన పట్టణం నలుపు, తెలుపు రంగులకే పరిమితమవుతుంది. పట్టణానికి చెందిన సాహస బాలలు రోజి, సెంటర్‌.. శాప విముక్తి కల్పించాలని నిర్ణయించుకుంటారు. అందుకు స్థానిక గ్రంథాలయంలో వివిధ పుస్తకాలు తిరగేస్తారు. వండర్‌ విజార్డ్‌లో ‘సర్కులస్‌’ గ్రహం విశేషాలు చదువుతారు. అందులో విముక్తి మార్గం కనిపిస్తుంది. వెంటనే పుస్తకంతో సహా అక్కడికి చేరుకుంటారు. ఎంతో శ్రమించి రత్నాలు సేకరిస్తారు. చివరకు పుస్తకం సాయంతో ఇంటికి చేరుకుంటారు. రత్నాలను వృత్తాకారంలో అమర్చడంతో రంగులమయంగా మారడంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. ఇలా కథ సుఖాంతమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని