logo

సేవలు వృద్ధి.. ‘లక్ష్య’ సిద్ధి

ప్రసూతి, నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిష్ఠాత్మకంగా ‘లక్ష్య’ పురస్కారాలు ప్రధానం చేస్తోంది.

Published : 21 Mar 2023 02:17 IST

జహీరాబాద్‌ ఆసుపత్రికి దక్కిన పురస్కారం
నాణ్యతా  ప్రమాణాల్లో రాష్ట్రంలో తొలి స్థానం

ఆసుపత్రిలో బాలింతల వార్డు

న్యూస్‌టుడే, జహీరాబాద్‌, అర్బన్‌: ప్రసూతి, నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిష్ఠాత్మకంగా ‘లక్ష్య’ పురస్కారాలు ప్రధానం చేస్తోంది. కాన్పు, బాలింతల వార్డుల్లో మెరుగైన వైద్యసేవలు సహా జాతీయ ఆరోగ్య మిషన్‌ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వైద్య విధాన పరిషత్తు ప్రాంతీయ ఆసపత్రికి సదరు అవార్డు దక్కడం విశేషం. లక్ష్య కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఆసుపత్రిగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

అంతర్రాష్ట్ర సరిహద్దులో..

అంతర్రాష్ట్ర సరిహద్దు పట్టణమైన జహీరాబాద్‌లోని వంద పడకల ఆసుపత్రికి డివిజన్‌తో పాటు వికారాబాద్‌ జిల్లాలోని మర్పల్లి, బంట్వారం సహా కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు వైద్యానికి వస్తుంటారు. సాధారణ, ప్రసూతి సేవలు ఇక్కడి వైద్యులు చక్కగా అందిస్తున్నారు. నిత్యం వెయ్యి మంది ఔట్‌పేషంట్లు ఉంటుండగా, నెలలో 350 కాన్పులు జరుగుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు సాధారణం కాగా, 30 శాతం లోపు శస్త్ర చికిత్స కాన్పులు చేస్తున్నారు.

మూడేళ్లు ప్రోత్సాహకాలు..

పురస్కారానికి ఎంపికైన ఆసుపత్రులకు జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌ సంయుక్తంగా మూడేళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనుంది. రూ.5 లక్ష చొప్పున మూడేళ్ల వరకు అందిస్తారు. ఈ నిధులను ప్రసూతి ఆపరేషన్‌ థియేటర్‌ ఆధునికీకరణకు కేటాయించడంతో పాటు వైద్యులు, సిబ్బంది పనితీరుకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు.

నవజాత శిశువును పరీక్షిస్తున్న వైద్యుడు శేషురావు

నిబంధనల మేర..

లక్ష్య పథకానికి సంబంధించి కేంద్రం పలు నిబంధనలు నిర్దేశించింది. ప్రసూతి గదిలో అన్ని సౌకర్యాలతో పాటు నవజాతి శిశువులకు చక్కని సేవలు అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. ఆయా వాటి ప్రకారం మార్కులు కేటాయిస్తారు. గత జనవరి 20, 21వ తేదీల్లో కేంద్ర అధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్‌ వైద్యుల బృందం ఆసుపత్రిని సందర్శించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ప్రసూతి, నవజాత శిశు వైద్యసేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జాతీయ స్థాయిలో నివేదిక సమర్పించడంతో పాటు స్కోరు కేటాయించారు. ఇందులో లేబర్‌ రూమ్‌ (ప్రసూతి) 94 శాతం, బాలింతలు, నవజాత శిశు వార్డుకు 95 శాతం స్కోర్‌ ఇవ్వడంతో జహీరాబాద్‌ ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది.


సమష్టి కృషికి గుర్తింపు
డా.శేషురావు, ఆసుపత్రి పర్యవేక్షకులు

వైద్యులు, సిబ్బంది సమష్టి కృషికి గుర్తింపుగా పురస్కారం దక్కింది. జాతీయ స్థాయి లక్ష్య పథకంలో రాష్ట్రంలో మొదటి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. మరింత బాధ్యతగా మెరుగైన సేవలు అందిస్తాం.


పైసా ఖర్చులేకుండా..
స్వప్న, గర్భిణి, పీచేర్యాగడి

జహీరాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. మొదటి కాన్పుకు ఇక్కడికే వచ్చాను మళ్లీ ఇప్పుడు రెండో సారి వచ్చాను. పైసా లేకుండా ప్రభుత్వం సేవలు అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని