logo

కంటి వెలుగులో మహిళదే పైచేయి

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లా ముందంజలో నిలుస్తోంది. కంటి పరీక్షల్లో 2.50 లక్షల మైలు రాయి దాటింది. 18 ఏళ్ల పైబడిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి వెంటనే రీడింగ్‌ అద్దాలు పంపిణీ చేస్తున్నారు.

Published : 21 Mar 2023 02:53 IST

పురుషుల కంటే 22 వేల మందికి పైగా వినియోగం
రోజూ అధికారుల సమీక్షతో కార్యక్రమంలో ముందంజ

శిబిరానికి హాజరైన మహిళకు నేత్ర వైద్య పరీక్షల తీరుపై అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు

న్యూస్‌టుడే, సిద్దిపేట: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లా ముందంజలో నిలుస్తోంది. కంటి పరీక్షల్లో 2.50 లక్షల మైలు రాయి దాటింది. 18 ఏళ్ల పైబడిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి వెంటనే రీడింగ్‌ అద్దాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 58.54 శాతం మేర పరీక్షలు జరిగాయి. జిల్లాలో జనవరి 19న మలి విడత ‘కంటి వెలుగు’ మొదలైంది. నిత్యం నిర్దేశిత ప్రాంతాల వారీగా 45 శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైద్యుడు, సూపర్‌వైజర్‌, ఆప్తాల్మిక్‌ అధికారి, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశా కార్యకర్తలు కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఉదయం 9 నుంచి రోజూ ప్రారంభమవుతోంది. మొత్తం 499 గ్రామపంచాయతీలకు 200 (40 శాతం) పంచాయతీల్లో శిబిరాలు పూర్తయ్యాయి. 35 గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఐదు పట్టణాల్లో 115 వార్డులకు గాను 65 వార్డుల్లో (56 శాతం) పూర్తయ్యాయి. మరో పది చోట్ల కొనసాగుతున్నాయి.

రావాల్సిన అద్దాలు 23 వేలు

శిబిరాలను సద్వినియోగం చేసుకున్న వారిలో మహిళలదే పైచేయిగా ఉంది. మహిళలు 1,43,633 మంది, పురుషులు 1,21,340 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ లెక్కన 22,293 మహిళలు అధికంగా వినియోగించుకున్నారు. దగ్గరి చూపు (రీడింగ్‌) అద్దాలు 54,095 మందికి పంపిణీ చేశారు. అందులో 40 ఏళ్లలోపు వారు 5,832 మంది, పైబడిన వారు 48,263 మంది ఉన్నారు. దూరం చూపు (ప్రిస్క్రిప్షన్‌) కళ్లజోళ్లు 43,018 మందికి రెఫర్‌ చేశారు. అందులో 19,492 మందికి పంపిణీ చేశారు. 23,526 మందికి అందించాల్సి ఉంది.

ముందంజలో నిలవడానికి చేస్తున్న కృషి..

జిల్లాలో నేత్ర వైద్య శిబిరాలు వేగంగా సాగేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ సూచిస్తున్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో శిబిరాలు సాగుతున్నాయి. జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు పాలనాధికారి ముజమ్మిల్‌ఖాన్‌, ఇతర అధికారులు.. నిత్యం సాయంత్రం వైద్య బృందాలతో టెలీ కాన్ఫరెన్సులో సమీక్షిస్తున్నారు.


మే నెలాఖరుకు పూర్తి
- కాశీనాథ్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో కంటి వెలుగు శిబిరాలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తాం. మే నెలాఖరుకు పరీక్షలు పూర్తి చేయాలని సంకల్పించుకున్నాం. 18 ఏళ్లు పైబడిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని