logo

తేలిన అంచనా.. సర్కారు కరుణించేనా!

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలకు నష్టమే మిగిలింది. సాధారణాన్ని మించి భారీ పరిమాణంలో వడగళ్లు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి.

Published : 22 Mar 2023 01:06 IST

సంగారెడ్డిలో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు నష్టం
నాలుగు జిల్లాల్లోని 1,873 ఎకరాల్లో దెబ్బతిన్న మామిడితోటలు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, మెదక్‌

నందికందిలో రాలిన మామిడికాయలను చూపుతూ..

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలకు నష్టమే మిగిలింది. సాధారణాన్ని మించి భారీ పరిమాణంలో వడగళ్లు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ల్లో కలిపి 1,873 ఎకరాల్లో మామిడికాయలు రాలాయి. వడగళ్ల వల్ల చెట్ల మీద ఉన్న కాయలూ పగిలిపోయాయి. వీటిని విక్రయించలేమని  రైతులు ఆవేదనగా చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో..

క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రైతులవారీగా ఎవరెవరు ఎంత నష్టపోయారనే వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు. వాటిని ఉన్నతాధికారులకు అందిస్తున్నామన్నారు. వానల వల్ల నష్టపోయిన తమకు ఊరట దక్కేలా పరిహారమిచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు ఆవేదనగా అడుగుతున్నారు. గతంలో చాలాసార్లు వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి కూడా తమకు పరిహారం అందలేదని వారు చెబుతున్నారు. ఈసారైనా ఇందుకు భిన్నంగా తమకు అండ నిలిచేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ప్రతిపాదనలు పంపిస్తున్నామని, తప్పక ఈసారి నష్టపరిహారం అందే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నదాతలు అధైర్యపడొద్దంటున్నారు.

మొక్కజొన్న, జొన్న పంటలకే ఎక్కువగా

రాళ్లవాన ధాటికి మొక్కజొన్న, జొన్న పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. వాటి వెన్ను విరిగి పంట నేలవాలింది. దిగుబడులు వచ్చే అవకాశమే లేదని అన్నదాతలు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న 1,520 ఎకరాల్లో పాడైంది. వికారాబాద్‌ జిల్లాల్లో 1,468 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఏకంగా 2,286 ఎకరాల్లో జొన్న పంటపై అకాల వర్షాల ప్రభావం పడింది. మొక్కజొన్న పంట 1,058 ఎకరాల్లో దెబ్బతింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని