logo

రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో ఉత్కంఠ

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఉత్కంఠకు దారి తీసింది. లబ్ధిదారుల ఎంపికకు అధికారులు 1550 మందితో జాబితాను సోమవారం విడుదల చేశారు.

Published : 22 Mar 2023 01:06 IST

అన్యాయం జరిగిందంటూ గజ్వేల్‌లో నిరసనలు

ఇళ్ల ఎంపికకు ఆడిటోరియంలో బారులు తీరిన దరఖాస్తుదారులు

గజ్వేల్‌ గ్రామీణ: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఉత్కంఠకు దారి తీసింది. లబ్ధిదారుల ఎంపికకు అధికారులు 1550 మందితో జాబితాను సోమవారం విడుదల చేశారు. వారిలో 1100 మందికి కేటాయించడానికి గజ్వేల్‌ మహతి ఆడిటోరియంలో లాటరీ పద్ధతి ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తుదారులు ఉదయం నుంచి ఆడిటోరియం వద్ద బారులు తీరారు. పేర్లు ఉన్నవారిని పోలీసులు లోపలికి అనుమతించారు. గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్లు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. జాబితాలో పేర్లు రాని వారిలో కొందరు అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. అనర్హులకు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ పునరుద్ధరించారు. లాటరీ పూర్తయ్యాక అందులో పేరు రాకపోవడంతో పలువురు యువకులు రహదారిపై హంగామా సృష్టించారు. యువకుడు ఒకరు పెట్రోలు పోసుకుంటానని బెదిరించడంతో పోలీసులు సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. డబ్బాలోని పెట్రోలును రోడ్డుపై పోసి నిప్పంటించగా ఆర్పేశారు. ఏసీపీ రమేశ్‌, సీఐలు వీరప్రసాద్‌, కమలాకర్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

దుబ్బాక తుది జాబితాలో తప్పులు!

దుబ్బాక: దుబ్బాక పురపాలికలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు సంబంధించి తుది జాబితాను అధికారులు మంగళవారం ప్రకటించారు. అనర్హులను ఎంపిక చేశారని, తప్పులతడకగా జాబితా ఉందని దరఖాస్తుదారులు ఆరోపించారు. 346 మంది లబ్ధిదారులను జాబితాలో పేర్కొన్నారు. కౌన్సిలర్లు పలువురు, పట్టణ భాజపా నాయకులు పోటాపోటీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. క్రమ సంఖ్య 25, 87, 91, 267లో వచ్చిన పేర్లే, 285, 301, 319, 334లోనూ వచ్చాయని తెలిపారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే చేయాలని కోరుతున్నారు. గతంలో విడుదలైన జాబితాల్లోనూ ఆరోపణలు రావడం గమనార్హం.

రహదారిపై నిప్పు పెట్టిన ఆందోళనకారుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని