logo

పోషకాహారం.. బాలలకు బలవర్ధకం

సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుతుంటారు. పలువురు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాఠశాలలకు చేరుతుంటారు.

Published : 22 Mar 2023 01:06 IST

శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సేవా నిరతి
న్యూస్‌టుడే, సిద్దిపేట

పాఠశాలల నిర్వాహకులకు పొట్లాలు ఇస్తున్న ప్రతినిధులు

సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుతుంటారు. పలువురు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాఠశాలలకు చేరుతుంటారు. వేసవి లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆకలి మరింతగా ఉంటుంది. తద్వారా ఏకాగ్రత లోపించి చదువులపై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో అలాంటి వారికెంతోమందికి శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు అండగా నిలుస్తోంది. ‘ఉదయపు పోషకాహార పానీయ’ సేవ ద్వారా బాలలకు ఉపకారం చేస్తుండటం విశేషం.

శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో 2019 నుంచి విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా బెల్లంతో కూడిన రాగి పౌడర్‌ అందిస్తోంది. కాలాలతో సంబంధం లేకుండా వివిధ వర్గాలకు చెందిన ప్రజల క్షుద్బాధను తీరుస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆహార, పానీయాలు అందించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఏళ్లుగా జిల్లాలో ఎంపిక చేసిన సర్కారు బడుల్లో అల్పాహారం అందజేస్తోంది. ఇటీవలి బెల్లంతో కూడిన రాగి పౌడర్‌ అందిస్తుండగా జావ తయారు చేసి ఇస్తున్నారు.

24 వేల మందికి..

సిద్దిపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలలతో పాటు దౌల్తాబాద్‌, చేర్యాల, మర్కూక్‌, రాయపోల్‌ మండలాల్లోని అన్ని బడుల్లో పంపిణీ కొనసాగుతోంది. ఇలా 217 చోట్ల అందిస్తుండగా 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. నిత్యం ఉదయాన్నే ప్రార్థనా సమయానికి ముందే జావ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇందుకు విద్యా శాఖ సహకారం తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నారు.

అల్పాహారం

గతంలో జిల్లాలోని 41 పాఠశాలల్లో అల్పాహారం పంపిణీ చేశారు. అటుకులు, ఉప్మారవ్వ సహా కిచిడీ చేసేందుకు వీలుగా బియ్యం, పప్పులు, ఇతరత్రావి అందించారు. ఫిబ్రవరి ముగింపు వరకు ఆయా సరకులు అందించి మధ్యాహ్న భోజన కార్మికులతో వండించేవారు. 5 వేల మంది ఆకలి తీర్చారు. ఒకపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో ఫిబ్రవరితో తాత్కాలికంగా స్వస్తి పలికారు. ప్రస్తుతం అల్పాహారం బదులు రాగిజావ పంపిణీ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం యథావిధిగా అల్పాహారం పథకాన్ని పునరుద్ధరించనున్నారు.

ప్రయోజనాలెన్నో..

ఉదయపు పోషకాహార పానీయంతో ప్రయోజనాలున్నాయి. జావ తయారీకి పంపిణీ చేసే మిశ్రమంలో రాగి, బెల్లం, సోయా, బియ్యం, దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు తదితర వాటిని పొడిగా చేసి ‘సాయి ష్యూర్‌’ పేరిట అందిస్తున్నారు. వీటిలో కార్బొహైడ్రేట్స్‌, కాల్షియం, మెగ్నీషియం, వివిధ రకాల విటమిన్లు, ఫైబర్లు, ఐరన్‌ ఉన్నాయి. ఇవి విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రాగి జావ..


సేవాభావంతో..: మహదేవ్‌ నరేశ్‌ జిల్లా సమన్వయకర్త

ట్రస్టు నిరంతర సేవాభావంతో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంత్రి హరీశ్‌రావు, జిల్లా విద్యా శాఖ సహకారంతో సమర్థంగా ఉదయపు పోషకాహార పానీయ సేవ అమలు చేస్తున్నాం. కార్యక్రమ అమలుకు రంగధాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాంప్రసాద్‌ సహకరిస్తున్నారు. విద్యార్థుల చదువు ఏకాగ్రతతో సాగేందుకు కార్యక్రమం దోహదం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని