logo

ఐదేళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి

ఐదేళ్ల క్రితం భార్య చనిపోగా.. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి రైల్వేస్టేషన్‌లో తానువు చాలించడంతో అతని ఎనిమిదేళ్ల కుమార్తె అనాథ అయింది.

Published : 22 Mar 2023 01:06 IST

అనాథ అయిన బాలిక

హైదరాబాద్‌: ఐదేళ్ల క్రితం భార్య చనిపోగా.. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి రైల్వేస్టేషన్‌లో తానువు చాలించడంతో అతని ఎనిమిదేళ్ల కుమార్తె అనాథ అయింది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌కు చెందిన మల్లేష్‌(36) విజయవాడలోని ఓ హోటల్‌లో పనిచేసేవాడు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం భార్య రమ్య చనిపోయింది. వారి ఎనిమిదేళ్ల కుమార్తె అపర్ణ తండ్రి వద్దే ఉంటుంది. మల్లేష్‌ ఏడాది క్రితం అనారోగ్యానికి గురి కావడంతో హోటల్‌లో పని మానేశాడు. అప్పటి నుంచి విజయవాడలోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్నాడు. గతంలో ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. మళ్లీ చికిత్స కోసమని తన కుమార్తెతో కలిసి బయల్దేరి సోమవారం రాత్రి సికింద్రాబాద్‌కు చేరుకున్నాడు. ఉదయం ఆసుపత్రికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లోని 8వ నంబరు ప్లాట్‌ఫాంపై ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం తండ్రిని నిద్ర లేపేందుకు కుమార్తె ప్రయత్నించగా స్పందించలేదు. అక్కడున్న పోలీసులకు చెప్పగా.. వెంటనే 108 సిబ్బందిని పిలిపించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించిన పోలీసులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారి ద్వారా వివరాలను తెలుసుకున్నారు. అనాథ అయిన పాప అపర్ణను ఛైల్డ్‌లైన్‌ సంస్థ ప్రతినిధులకు అప్పగించి ఆశ్రయం కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని