logo

అనుసంధానంతో.. అనువైన రవాణా

జిల్లా కేంద్రంగా మెదక్‌ ఏర్పాటయ్యాక జాతీయ రహదారుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో  పట్టణం వరకు జరుగగా, తాజాగా మరొకటి ప్రారంభించారు

Published : 23 Mar 2023 01:11 IST

ప్రారంభమైన మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు

న్యూస్‌టుడే-మెదక్‌, మెదక్‌ రూరల్‌

అవుసులపల్లి శివారులో కొనసాగుతున్న పనులు

జిల్లా కేంద్రంగా మెదక్‌ ఏర్పాటయ్యాక జాతీయ రహదారుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో  పట్టణం వరకు జరుగగా, తాజాగా మరొకటి ప్రారంభించారు. దీంతో రెండు జిల్లాలకు రవాణ సౌకర్యం మెరుగు పడనుంది. పుణ్యక్షేత్రాలు, పర్యటక ప్రాంతాలను సందర్శించే వారికి, నిత్యం రాకపోకలు కొనసాగించే ప్రయాణికులకు అనువుగా మారనుంది. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం...

జిల్లాలో 44, 765(డి), 161 జాతీయ రహదారులున్నాయి. వీటిలో 44 ప్రధానమైంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఈ రహదారి జిల్లామీదుగా వెళుతోంది. హైదరాబాద్‌కు ఇదీ ప్రధాన మార్గం. మూడేళ్ల కిందట బాలానగర్‌ నుంచి నర్సాపూర్‌ మీదుగా మెదక్‌ వరకు 765(డి)ని నిర్మించారు. ఈ క్రమంలో మెదక్‌ నుంచి సిద్దిపేట మీదుగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిని మంజూరు చేసింది. దీనికి 765డిజీగా నామకరణం చేశారు. 133.61 కిలోమీటర్ల నిర్మించనున్న ఈ రోడ్డును రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1 మెదక్‌ పట్టణం నుంచి సిద్దిపేట పట్టణ పరిధి బాబుజగ్జీవన్‌రాం చౌరస్తా వరకు, ప్యాకేజీ-2 సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి వంతెన నుంచి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు చేపట్టనున్నారు.

రూ.882 కోట్లతో.

ప్యాకేజీ-1లో భాగంగా మెదక్‌ పట్టణం నుంచి సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి వంతెన వరకు చేపట్టే జాతీయరహదారి పనులు ఇటీవల షురూ అయ్యాయి. మెదక్‌లోని బోధన్‌ చౌరస్తా నుంచి జాతీయ రహదారి పనులను మొదలుపెట్టారు. ప్రస్తుతం పట్టణ పరిధి అవుసులపల్లి నుంచి హవేలిఘనపూర్‌ మండలం ఔరంగబాద్‌ తండా మీదుగా మండల పరిధి పాతూర్‌కు వెళ్లే దారిలో పనులు జరుగుతున్నాయి. ఆయా చోట్ల కల్వర్టులను నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంతో జిల్లా పరిధిలోని గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారనున్నాయి. మెదక్‌ మండలం పాతూర్‌, రామాయంపేట మండలం అక్కన్నపేట, కోనాపూర్‌, నిజాంపేట మండలం కేంద్రం, నందిగామ గ్రామాల్లో నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఆయా గ్రామాల్లో విస్తరణతో పాటు విభాగినితోపాటు వీధి దీపాలు ఏర్పాటు కానున్నాయి. మెదక్‌ మండలం పాతూర్‌ నుంచి అక్కన్నపేట వరకు అటవీ ప్రాంతం కావడంతో ఈ మార్గంలో ఇరువైపులా 10 మీటర్ల వరకు విస్తరించనున్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట వరకు పలు చోట్ల మలుపులున్నాయి. వాటిని సరి చేస్తూ, నేరుగా రహదారి నిర్మించేలా చర్యలు చేపట్టారు. మెదక్‌ పరిధి అవుసుపల్లి శివారులోనూ, హవేలిఘనపూర్‌ మండలం శమ్నాపూర్‌, రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌, తొనిగండ్ల, అక్కన్నపేట వరకు ఆయా ప్రాంతాల్లో మలుపులను సరిచేస్తున్నారు. రెôడేళ్లలో పనులను పూర్తి చేస్తామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డీఈఈ రామకృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని