logo

ఆధార్‌ నవీకరించుకుందాం..

చదువు నుంచి ఉద్యోగాల వరకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం అందరి వద్ద ఈ కార్డు ఉంది. తాజాగా సవరణలకు దరఖాస్తు విధానాన్ని మార్పు చేసింది

Published : 23 Mar 2023 01:11 IST

న్యూస్‌టుడే, చేగుంట: చదువు నుంచి ఉద్యోగాల వరకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం అందరి వద్ద ఈ కార్డు ఉంది. తాజాగా సవరణలకు దరఖాస్తు విధానాన్ని మార్పు చేసింది. పదేళ్లు దాటిన వారు కార్డును నవీకరణ చేసుకోవాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు. వీటిని కామన్‌ సర్వీస్‌ కేంద్రాలతో పాటు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేంద్రాలతో పాటు ఆధార్‌ కేంద్రాల్లో ఉచితంగా సేవలు పొందవచ్చు. అంగన్‌వాడీ పర్యవేక్షకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 469 పంచాయతీలతో పాటు మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ పురపాలికల్లో నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది.

పేరు సవరించాలంటే..

ఫొటోతో ఉన్న ధ్రువపత్రాన్ని తప్పని సరిగా పొందుపర్చాలి. పదో తరగతి మార్కుల మెమో, పాన్‌, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఉపాధి జాబ్‌కార్డు, సదరం ధ్రువీకరణ పత్రాల్లో ఏదైన ఒకదానిని జతచేయాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, వివాహితులైతే ఉప రిజిస్ట్రారు కార్యాలయం జారీ చేసే ధ్రువపత్రం, తహసీల్దారు ఇచ్చే కుల ధ్రువపత్రాలను సమర్పించాలి.

పుట్టినతేదీ మార్పునకు..

గతంలో పుట్టిన తేది మార్చుకునేందుకు నమూనా పత్రాన్ని భర్తీ చేసి గెజిటెడ్‌ అధికారి సంతకం చేయిస్తే సరిపోయేది. పాన్‌కార్డులో ఉన్న తేదీని అధికారికంగా ధ్రువీకరించుకునే వీలు ఉండేది. చిన్నారులకైతే తప్పనిసరిగా పురపాలిక, పంచాయతీలు జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇది కూడా ఒకసారి మాత్రమే సవరించుకోవచ్చు. రెండో సారి మార్పు చేసుకోవాలంటే రాజధాని కార్యాలయానికి వెళ్లి తగిన వివరణ ఇస్తూ ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

లింగమార్పిడి..

జెండర్‌ విషయంలో సవరణకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పించారు. ఇందుకుగాను తప్పకుండా అర్హతగల గుర్తింపుపత్రాన్ని జతచేయాలి. మరో సారి చేయాలంటే ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఇందుకు చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

వయసుల వారీగా

కొత్తగా సవరణకు  మూడు కేటగిరీలుగా విభజించారు. అయిదేళ్లలోపు చిన్నారులను మొదటి, 5-18 ఏళ్లలోపు రెండు, 18 ఏళ్లు పైబడినవారిని మూడో కేటగిరీగా చేసి,  మూడు దరఖాస్తులను ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని