logo

పక్కా ప్రణాళికతోనే దారి దోపిడీ

తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని వాహనం డ్రైవర్‌కు వచ్చిన దురాశ వల్లే, పక్కా ప్రణాళికతో తాట్‌పల్లి శివారులో దారి దోపిడీకి పాల్పడ్డారని, నిందితులంతా 30 ఏళ్ల వయస్సులోపు వారేననని మెదక్‌ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జీ తెలిపారు.

Updated : 23 Mar 2023 05:27 IST

 డ్రైవర్‌ దురాశే నేరానికి కారణం
కేసు వివరాలు వెల్లడించిన మెదక్‌ డీఎస్పీ, సీఐ

వివరాలు తెలుపుతున్న మెదక్‌ డీఏస్పీ సైదులు, సీఐ జార్జి

రేగోడ్‌, న్యూస్‌టుడే: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని వాహనం డ్రైవర్‌కు వచ్చిన దురాశ వల్లే, పక్కా ప్రణాళికతో తాట్‌పల్లి శివారులో దారి దోపిడీకి పాల్పడ్డారని, నిందితులంతా 30 ఏళ్ల వయస్సులోపు వారేననని మెదక్‌ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జీ తెలిపారు. రేగోడ్‌ ఠాణాలో బుధవారం సమావేశం నిర్వహించి సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణం రాజన్నపేట వీధిలో రవికిరణ్‌ కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఐటీసీ కంపెనీకి చెందిన ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లోని దుకాణాలకు తరలించేందుకు డ్రైవర్‌ మహమ్మద్‌ అహ్మద్‌ను నియమించుకుని నెలకు రూ.16,500 వేతనం ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 20వ తేదీన ఎప్పటిలాగే వాహనాన్ని తీసుకెళ్లి సామగ్రి సరఫరా చేశారు. అనంతరం జహీరాబాద్‌కు వెళ్లే క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా, ముందే అనుకున్న ప్రకారం పథకాన్ని అమలు చేసి మరికొందరితో కలిసి తాట్పల్లి శివారులో దోపిడీ చేశారు.  

ఎక్కువ డబ్బులు సంపాదించాలని..: కుటుంబ పోషణకు ప్రస్తుతం వస్తున్న వేతనం సరిపోవడం లేదని, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేందుకు ప్రణాళిక వేస్తున్నానని, సహకరించాలని మిత్రుడు అన్వర్‌ను అహ్మద్‌ కోరడంతో, డబ్బులకు ఆశపడి అంగీకరించాడు.  అయితే మరికొంత మంది సహాయం కావాలని మీర్జా కసిఫ్‌కు విషయం తెలిపాడు. అతనికి పరిచయం ఉన్న 8మందికి డబ్బుల ఆశ చూపి ఒప్పించారు. వీరంతా 20వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనైనా తమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. డ్రైవర్‌ అహ్మద్‌ ఎప్పటిలాగే వస్తువులను వాహనంలో వేసుకున్నాడు. బయలుదేరే విషయాన్ని అన్వర్‌కు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇలా అందరూ జహీరాబాద్‌ శివారులో కలుసుకుని, కట్టెలు, కారంపొడి, కత్తి సిద్ధం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వస్తువులను సరఫరా చేశాక, డబ్బులతో తిరిగి వస్తుండగా, సైఫ్‌ఖాన్‌, మస్తాన్‌, చోట హర్షద్‌, బడా హర్షద్‌, బుర్హన్‌, మంజూర్‌, జమీర్‌, సుఫీయాన్‌ బృందాలుగా విడిపోయి తాట్పల్లి శివారులోకి వాహనం రాగానే అడ్డగించారు. డ్రైవర్‌ అహ్మద్‌తో పాటు వాహనంలో ఉన్న శ్రీకాంత్‌, సుధాకర్‌లపై దాడి చేసి బెదిరించారు. వారి వద్ద నగదు సంచి, రెండు చరవాణులు, వాహనం తాళాలు లాక్కెళ్లారు. రూ.7,46,411ను పంచుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాయిపల్లి కూడలి వద్ద నిందితులు ఉన్నట్లు బుధవారం సమాచారం అందడంతో 11 మందిని అరెస్టు చేశాం. వారి నుంచి రూ.6.70 లక్షలు, కత్తి స్వాధీనం చేసుకుని, మెదక్‌ కోర్టుకు రిమాండ్‌ చేశాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని