logo

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మరణించడం గ్రామంలో కలకలం రేపింది.

Published : 23 Mar 2023 01:26 IST

నువ్వంటే నువ్వే కారణమని అత్తాకోడళ్ల పరస్పర ఆరోపణ

మృతిచెందిన అశ్విని

కోహీర్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మరణించడం గ్రామంలో కలకలం రేపింది. కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. గ్రామస్థులు, ఎస్సై సురేష్‌ కథనం ప్రకారం.. కోహీర్‌ మండల పరిధి పైడిగుమ్మల్‌ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి, మాచిరెడ్డిపల్లికి చెందిన భువనగిరి వెంకటరెడ్డి ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు కొన్నాళ్లు పైడిగుమ్మల్‌లోనే జీవించారు. వృత్తిరీత్యా మేస్త్రీ పనులు చేసుకునే వెంకటరెడ్డి మద్యానికి బానిసయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్వగ్రామమైన మాచిరెడ్డిపల్లికి వచ్చి ఉంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. రెండేళ్ల కిందట ఏడాది వయసున్న కుమారుడు మరణించాడు. చిన్న కుమార్తె అశ్విని(15 నెలలు) బుధవారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిన్నారి తల్లి భాగ్యలక్ష్మి తన అత్త వనజమ్మపై అనుమానం వ్యక్తం చేస్తుండగా, తన కోడలే చిన్నారిని హత్యచేసి ఉంటుందని అత్త ఆరోపించింది. విషయం తెలుసుకున్న కోహీర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామపెద్దల సమక్షంలో వివరాలు సేకరించారు. అశ్విని మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం జహీరాబాద్‌ వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాలుడి మృతిపైనా సందేహాలు

రెండేళ్ల కిందట, ఏడాది వయసున్న వెంకటరెడ్డి, నాగలక్ష్మి దంపతుల కుమారుడు చనిపోవడంపై ఇప్పుడు గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ విషయం అంత చర్చనీయాంశం కాలేదు. అత్తాకోడళ్ల మనస్పర్థలే ఇద్దరినీ బలిగొని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని