logo

యంత్రం పక్కకుపెట్టి.. హాజరు గుప్పిటపట్టి!

పురపాలికల్లో పొరుగు సేవల పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు విషయంలో కొందరు పర్యవేక్షకులు అక్రమాలకు పాల్పడుతున్నారు.

Published : 23 Mar 2023 01:26 IST

పురపాలికల్లో దందాలకు తెరలేపిన పర్యవేక్షకులు
ఈనాడు, సంగారెడ్డి

సంగారెడ్డి పురపాలికలో ఇటీవల పొరుగు సేవల సిబ్బంది ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు

పురపాలికల్లో పొరుగు సేవల పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు విషయంలో కొందరు పర్యవేక్షకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. బయో మెట్రిక్‌ యంత్రాలు పక్కకుపెట్టి తమకు నచ్చిన వారి పేర్లు రిజిస్టర్లలో రాసేసి వంద శాతం హాజరు వేస్తున్నారు. వారు క్షేత్రస్థాయిలో పనిచేయకపోయినా జీతాలిస్తూ ఆ సొమ్మును జేబుల్లోకి వేసుకుంటున్నారు. పేర్లు ఒకరివి రాసి, పని మరొకరి చేత చేయిస్తూ కమీషన్లు దండుకొంటున్నారు. సంగారెడ్డి పురపాలికలో జరుగుతున్న ఈ దందా బహిరంగ విచారణలో వాస్తవమని వెల్లడైంది. సాక్షాత్తూ పురపాలిక అధ్యక్షురాలి బంధువులు ఆరుగురు పనిచేస్తున్నట్లు వెలుగు చూసింది. పూర్తి వివరాలు సేకరించాక చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇతర పురపాలికల్లో పరిశీలించగా.. బయోమెట్రిక్‌ యంత్రాలు అటకెక్కించినట్లు తేలింది.

365 రోజులూ పనిచేశారట

పారిశుద్ధ్య నిర్వహణ, వాటర్‌ వర్స్క్‌, రెవెన్యూ తదితర విభాగాల్లో పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదయం బయోమెట్రిక్‌ యంత్రాలతో వీరి హాజరు తీసుకొనేవారు. కరోనా సమయంలో యంత్రాలను తాత్కాలికంగా పక్కకు పెట్టగా, ఆ తర్వాత పూర్తిగా మూలకు పడేశారు. సంగారెడ్డి పురపాలికలోని వాటర్‌ వర్స్క్‌ విభాగంలో 24 మంది పనిచేస్తున్నారు. గత ఏడాది కాలంగా వీరంతా ఒక్కటంటే ఒక్క సెలవు పెట్టకుండా విధులకు హాజరైనట్లు చూపారు. హాజరు పట్టికను ఇటీవలే సిద్ధం చేయడం గమనార్హం. పరిశీలిస్తే మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇలాంటివి వెలుగుచూస్తాయి.

పనితీరుపై ప్రభావం: పురపాలికల్లో సమయానికి నీళ్లు రావాలన్నా, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నా, పార్కులు ఆహ్లాదం పంచాలన్నా పొరుగు సేవల సిబ్బందే కీలకం. సిబ్బందిలో కొందరు విధులకు హాజరుకాకుండానే, పర్యవేక్షకులతో కలిసి జీతాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అన్ని పురపాలిక కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు వాడుతుండగా, క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు తీసుకొనేందుకు మాత్రం వాడడంలేదు. కొన్ని చోట్ల కొద్దిమందికే పరిమితం చేస్తున్నారు. జహీరాబాద్‌లో పారిశుద్ధ్య విభాగంలోని 150 మంది హాజరుకు బయోమెట్రిక్‌ వాడుతున్నారు. మిగతా విభాగాల్లో పనిచేసే 72 మందికి రిజిస్టర్లను వినియోగిస్తున్నారు. జోగిపేట పురపాలికలో మొక్కుబడిగా వాడుతున్నారు.

గతంలోనూ ఆరోపణలు

పురపాలికల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పనిచేయడానికే కొందరు సిబ్బందిని నియమించుకున్నారు. జహీరాబాద్‌, సంగారెడ్డి పురపాలికల్లో గతంలోనూ ఇలాంటివి వెలుగు చూశాయి. బయోమెట్రిక్‌ యంత్రాలున్నప్పుడు ఈ అక్రమాలు కొంత మేర తగ్గాయి. ఇప్పుడు అటకెక్కడంతో పర్యవేక్షకులే మళ్లీ అక్రమాలకు తెరలేపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు