logo

కేంద్రాల్లో ఆహ్లాదం.. చిన్నారుల వికాసం

జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నారు. ఇందుకోసం 11 ఎంపిక చేశారు. ఒక్కో దానికి రూ.3.50 లక్షల చొప్పున సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు చేశారు.

Published : 24 Mar 2023 01:14 IST

జిల్లాలో 11 కేంద్రాలకు సీఎస్‌ఆర్‌ నిధులు
న్యూస్‌టుడే, నర్సాపూర్‌

గోడలపై వివిధ రకాల చిత్రాలు

జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నారు. ఇందుకోసం 11 ఎంపిక చేశారు. ఒక్కో దానికి రూ.3.50 లక్షల చొప్పున సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) ద్వారా నాలుగు ప్రాజెక్టుల పరిధిలో నర్సాపూర్‌-5, అల్లాదుర్గం-1, రామాయంపేట-2, మెదక్‌-3 ఎంపిక చేశారు. నర్సాపూర్‌ పరిధి రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, జక్కపల్లి, నర్సాపూర్‌-2, మల్కాపూర్‌ ఉన్నాయి. ఎంపిక చేసిన కేంద్రాలకు రంగులు వేయించడం, ప్రహరీ నిర్మాణం, గోడలపై ఆకట్టుకునేలా బొమ్మలు వేయించడం చేస్తున్నారు. మూడేళ్ల లోపు చిన్నారులకు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారం చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. పరిశుభ్రంగా ఉంచి, ఆట వస్తువులను సమకూరుస్తున్నారు. గోడలపై ఆంగ్ల ఉచ్ఛరణకు సంబంధించిన పదాలు, తెలుగు, ఆంగ్లం అక్షరాలు,  సీతాకోకచిలుకల బొమ్మలు, అక్షరాలను సూచించే చిత్రాలు, పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు, పాలిచ్చే తల్లుల, చిన్నారుల చిత్రాలు ఆకర్షిస్తున్నాయి.

పిల్లల సంఖ్య పెరిగేలా

చిన్నారుల సంరక్షణకు చర్యలు తీసుకోవడం ద్వారా కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కేంద్రాలకు వచ్చినప్పుడు కొంత సమయాన్ని వెచ్చించేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారుల పరిస్థితిపై సీడీపీవోలు, పర్యవేక్షకులు, అంగన్వాడీ ఉపాధ్యాయినులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. పోషణ్‌ అభియాన్‌, ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, కేంద్రాల్లో ఇచ్చే బాలామృతాన్ని బిడ్డకు ఎలా అలవాటు చేయాలో కూడా చైతన్యపరుస్తున్నారు. పిల్లల బరువు ఎత్తు కొలతలు, తక్కువ బరువు ఉన్నవారి పోషణ ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రాల ఆవరణలో పెరటి తోటల పెంపకం చేపడుతున్నారు.  


ఆకర్షణీయంగా ఉండాలన్నదే లక్ష్యం

కొన్ని కేంద్రాలను ఎంపిక చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. తద్వారా సాధించిన ఫలితాలను గమనించి భవిష్యత్తులో అన్ని కేంద్రాలను ఇదే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వసతుల్లో ఆదర్శంగా ఉంచడంతోపాటు, సేవల్లోనూ మెరుగుగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం.

బ్రహ్మాజీ, జిల్లా అధికారిణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని