logo

అమ్ముకునేందుకు అవస్థ!

శనగలు పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. నాఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు.

Published : 24 Mar 2023 01:11 IST

శనగల కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి దయనీయం
వారాలు గడుస్తున్నా అందని బిల్లులు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌, సిర్గాపూర్‌, మనూరు

శనగలు పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. నాఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని కేంద్రాల్లో తమ వంతు కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. టోకెన్లు సంపాదించి చివరకు అమ్ముకున్నా వారాలు గడిచినా నగదు ఖాతాల్లో జమకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాఫెడ్‌ నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. సదాశివపేట, జహీరాబాద్‌, సిర్గాపూర్‌, మనూరు మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది.


రేపు.. మాపంటూ జాప్యం

సిర్గాపూర్‌ మండలంలోని బొక్కస్‌గావ్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రమిది. ఈ మండలంతో పాటు కల్హేర్‌, కంగ్టి మండలాల్లో శనగలు పండించిన రైతులు విక్రయించుకునేందుకు వీలుగా ఇక్కడ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు మాపంటూ జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ కొనుగోళ్లు మొదలవలేదు. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయస్తున్నారు.


తరలింపులో నిర్లక్ష్యం

సదాశివపేటలోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 350 క్వింటాళ్లు కొన్నారు. పదిరోజుల క్రితం ఇందులో 250క్వింటాళ్లు గోదాముకు తరలించారు. ఇంకా 100 క్వింటాళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇవి గోదాముకు వెళితేనే ఆయా రైతుల పేరిట బిల్లు నమోదు చేస్తారు. గోదాములకు పంపిన తర్వాత నాణ్యత బాగా లేదని కూడా తిప్పి పంపుతున్నారని నిర్వాహకులు వివరించారు. కనీసం నెలరోజులు గడిస్తేనేగానీ అమ్మిన శనగల డబ్బులు ఖాతాల్లో జమయ్యేలా లేవని రైతులు నిరాశగా చెబుతున్నారు.


మధ్యాహ్నమైనా తెరచుకోలేదు

మనూరు మండలంలోని శనగల కొనుగోలు కేంద్రమిది. ఇక్కడ ఇప్పటి వరకు 161 మంది రైతుల నుంచి 2,233 క్వింటాళ్లు కొన్నట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు. కేంద్రాన్ని ఇష్టానుసారం నిర్వహిస్తుండటంతో విక్రయించేందుకు ఇక్కడకు వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో వెళ్లి చూడగా ఇంకా గేటు మూసేసే ఉంది. ఇదే  విషయమై అక్కడి నిర్వాహకులను అడగ్గా.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెరిచామని సమాధానమిచ్చారు.


హమాలీల కొరత.. తప్పని నిరీక్షణ

జహీరాబాద్‌లో గతనెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇక్కడకు శనగలను తీసుకొచ్చిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. హమాలీల కొరత సాకుగా చూపుతున్నారు. త్వరగా తూకం వేయాలంటే బస్తాకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా ఇచ్చుకోక తప్పడం లేదని కొందరు వివరించారు. టోకెన్లు జారీ చేసే సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. తాను టోకెన్ల కోసం మూడు రోజులుగా వచ్చిపోతూనే ఉన్నానని పోతిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని