logo

భగీరథ జలం.. సరఫరాలో అవాంతరం

శుద్ధి చేసిన నీటిని ప్రజలకు సరఫరా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి పల్లెకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తోంది.

Published : 24 Mar 2023 01:11 IST

జిల్లాలోని కొన్ని గ్రామ్లాల్లో ప్రజల ఇక్కట్లు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కంది(ఇంద్రకరణ్‌), రాయికోడ్‌, కల్హేర్‌

రాయికోడ్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట టవర్స్‌ కాలనీ వాసుల నిరసన

శుద్ధి చేసిన నీటిని ప్రజలకు సరఫరా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి పల్లెకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సరఫరాకు నోచుకోవడం లేదు. పైపులకు తరచూ లీకేజీలు ఏర్పడటం, సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో కొండాపూర్‌ మండలం రాంపూర్‌ తండా వాసులు, రాయికోడ్‌కు చెందిన ప్రజలు ఆయా ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పల్లెల్లో భగీరథ నీటి సరఫరా తీరుపై కథనం.

13 ఆవాస ప్రాంతాల్లో పూర్తికాని పనులు

పుల్కల్‌ మండలం పెద్దారెడ్డిపేట, మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి శివారులోని మంజీరా పరీవాహకం నుంచి శుద్ధి చేసిన నీటిని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 943 ఆవాస ప్రాంతాలు ఉండగా.. 925 ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. 13 పల్లెల్లో ఇంకా పనులు పూర్తి కాలేదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నిరసన తెలిపినా.. తీరని సమస్య

రాయికోడ్‌లోని టవర్స్‌ కాలనీలో మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయడం లేదని ఆ కాలనీవాసులు ఇటీవల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి పక్షం రోజులవుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. కోడూరు, నాగన్‌పల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొండాపూర్‌ మండలం రాంపూరు తండాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని అక్కడివాసులు గత నెలలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసినా ఎలాంటి ఫలితం లేదు. మునిదేవునిపల్లి శివారు గడిమల్కాపూర్‌, మన్‌సాన్‌పల్లి, మాచేపల్లిలోనూ తాగునీటి సమస్య వేధిస్తోంది.

క్షేత్ర స్థాయి పరిస్థితి

* మనూరు మండలం అతిమ్యాల్‌, పుల్‌కుర్తి గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. ఇటీవల మండల పరిషత్‌లో సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినా ఎలాంటి ఫలితం లేదు.

* కల్హేర్‌ మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఎస్సీ వాడకు మంచినీటి పైపులైన్‌ వేశారు. కనెక్షన్‌ ఇవ్వలేదు. మహాదేవుపల్లిలో నాందేడ్‌-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. పైపులైన్‌ పూర్తిగా ధ్వంసమైంది. గ్రామాలో అంతర్గత పైపులైన్‌ వ్యవస్థ అధ్వానంగా మారింది. గ్రామస్థులు వ్యవసాయ బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

* సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌పేటలకు నెలరోజులగా తాగునీటి సరఫరా చేయడం లేదు.

* కంది మండలం చిద్రుప్ప, బేగంపేట, బేగంపేట తండాల్లో మిషన్‌ భగీరథ, స్థానికంగా బోరు నీటిని కలిపి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


త్వరలో పరిష్కరిస్తాం: ఎస్‌కే పాషా, ఈఈ, మిషన్‌ భగీరథ పథకం

జిల్లాలోని 13 ఆవాస ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యల వల్ల నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదు. త్వరలో ఆ సమస్యలను పరిష్కరిస్తాం. ఇటీవల తమ దృష్టికి వచ్చిన రాంపూర్‌ తండా, రాయికోడ్‌లో పరిష్కరించేందుకు ఇప్పటికే పనులు ఆరంభించాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని