logo

దేవునికుంటలో మట్టిదందా

అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు ఇష్టారీతిన మట్టిదందాకు పాల్పడుతున్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు శివారులో దేవునికుంట ఉంది.

Published : 24 Mar 2023 01:11 IST

మట్టి నింపుకొనేందుకు వచ్చిన ట్రాక్టర్లు

అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు ఇష్టారీతిన మట్టిదందాకు పాల్పడుతున్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు శివారులో దేవునికుంట ఉంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న నీటి వనరును ధ్వంసం చేసేలా కొందరు పట్టపగలే మట్టి తవ్వి తరలిస్తున్నారు. తమకు పంచాయతీ నుంచి తీర్మానం ఉందని చెప్పి పదుల సంఖ్యలో ట్రాక్టర్లను వినియోగిస్తూ దర్జాగా దందా చేస్తున్నారు. వాస్తవానికి పూడిక మట్టిని మాత్రమే రైతుల పొలాలకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. ఇదంతా రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారుల ఆదేశాల మేరకు జరగాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటిదేమీ లేదు. తమకు నచ్చిన చోట మట్టిని తవ్వుతూ తీసుకెళ్లిపోతున్నారు. గ్రామ సమీపంలోని ఒక చోట కుప్పలుగా పోస్తున్నారు. ఈ భూమి కాస్త లోతుగా ఉండటంతో దాదాపు 600 ట్రిప్పుల మట్టిని నింపేలా పనులు చేస్తున్నామని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వివరించారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దారు మనోహర్‌ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లగా... తాను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందినా రోజంతా యథావిధిగా మట్టి తరలింపు కొనసాగడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తరలించిన మట్టికి సమానమైన పరిహారాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - ఈనాడు, సంగారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని