logo

పాత నీటి పథకాలే దిక్కు

మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కొన్నిచోట్ల సాధ్యం కావడం లేదు.

Published : 24 Mar 2023 01:11 IST

పూర్తి స్థాయిలో సరఫరా కాని ‘మిషన్‌ భగీరథ’
పంచాయతీలకు తప్పని విద్యుత్తు బిల్లుల భారం
- హుస్నాబాద్‌ గ్రామీణం, సిద్దిపేట, మద్దూరు, నంగునూరు - న్యూస్‌టుడే

హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో సింగిల్‌ఫేజ్‌ బోరుమోటారు నీటిని పట్టుకుంటున్న మహిళ

మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కొన్నిచోట్ల సాధ్యం కావడం లేదు. కొన్ని గ్రామాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. ఇంట్రా, గ్రిడ్‌ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. లీకేజీలు, మరమ్మతుల పేరిట రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. సరఫరా జరగని గ్రామాల్లో పాత రక్షిత మంచినీటి పథకాలే దిక్కవుతున్నాయి. భగీరథ నీటితో పాటు బావులు, బోర్ల నుంచి ట్యాంకు నింపి సరఫరా చేస్తున్నారు. పాత  పథకాల ద్వారా సరఫరా చేస్తే విద్యుత్తు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. గుత్తేదారు పనులు నాణ్యంగా లేకపోవడంతో ట్యాంకు కారుతోంది. గేట్‌వాల్వులు సరిగా లేక రోడ్లన్నీ నీటితో నిండుతున్నాయి. ఇంటింటికీ పూర్తిస్థాయి నీరు రావటం లేదు. గ్రామానికి రెండు రక్షిత మంచినీటి బావులు, 2 త్రీఫేజ్‌ బోరు మోటార్లు, 18 సింగిల్‌ ఫేజ్‌వి ఉన్నాయి. పంచాయతీకి వచ్చే నిధులు విద్యుత్తు బిల్లులకే సరిపోతున్నాయని సర్పంచి బత్తిని సాయిలు తెలిపారు. నెలకు రూ.60 వేలు వస్తోందన్నారు. బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భల్లునాయక్‌తండా సర్పంచి ఇస్లావత్‌ రజిత కోరుతున్నారు. వంగరామయ్యపల్లిలో, వడ్డెర కాలనీలో సరిపోయేన్ని రావటం లేదని సర్పంచి విజయలక్ష్మి కోరారు.  

ఎత్తుకు చేరలేని పరిస్థితి

అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామం చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ రెండు ట్యాంకులు, గ్రామ పరిధిలోని బోరింగ్‌తండా, అంబబాయితండా, శ్రీరాంతండాలోనూ నిర్మించారు. వీటిలో నీటిని ఎక్కించేందుకు ఒత్తిడి పెంచితే పైపులైన్లు పగిలిపోతున్నాయి. గొట్టాలు భూమిలో వేసేటపుడు లెవల్‌ సరిగా చూడకపోవటంతో సమస్య తలెత్తుతోంది. ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. కట్కూర్‌లో ఎప్పుడు నీరు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. కుందన్‌వానిపల్లి, అంతకపేటలో కనెక్షన్లు ఇవ్వలేదు. మల్లంపల్లిలోని రెండు ట్యాంకుల్లో ఒక్కదానికే ఎక్కుతున్నాయి. ధూల్మిట్ట మండలం దుబ్బతండాకు మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. ట్యాంకును ఎత్తులో నిర్మించడంతో ఎక్కటం లేదు. వ్యవసాయ బోర్ల వద్ద నుంచి బిందెలతో తెచ్చుకుంటున్నారు. నంగునూరు మండలం దర్గపల్లిలో ట్యాంకు మెట్లు కూలిపోయాయి. దానిని శుభ్రం చేయక పోవడంతో నీరు కలుషితంగా వస్తున్నాయి. వాటిని గ్రామస్థులు వినియోగించడం లేదు. అక్కెనపల్లిలో రెండు పడకగదుల ఇళ్ల సముదాయానికి ట్యాంకు ఉన్నా నీరు రావటం లేదు.

ఎస్సీ కాలనీలో మినీ వాటర్‌ ట్యాంక్‌


ఆపరేటర్లకు అవగాహన కల్పించి పరిష్కరిస్తాం

కొన్ని చోట్ల సమస్య ఉంది. కొన్ని ట్యాంకులకు ఔట్‌లెట్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్ని ఎత్తులో ఉన్నాయి. ఆపరేటర్లకు సరైన అవగాహన లేక నీటి సరఫరాలో సమస్య వస్తోంది. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తాం. ప్రతి రోజూ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

బాలరాజు, మిషన్‌ భగీరథ డీఈఈ (గ్రిడ్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని