logo

క్షయ.. అప్రమత్తతే రక్ష

క్షయ.. తుమ్మినా, దగ్గినా, నోటి నుంచి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. చాపకింద నీరులా క్షయ విస్తరిస్తుండగా ఆందోళన కలిగిస్తోంది.

Updated : 24 Mar 2023 06:12 IST

- న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ

అనంతగిరిలోని క్షయ, ఛాతి వ్యాధుల ఆసుపత్రి

క్షయ.. తుమ్మినా, దగ్గినా, నోటి నుంచి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. చాపకింద నీరులా క్షయ విస్తరిస్తుండగా ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా పారిశ్రామిక వాడలో దీని వ్యాప్తి అధికంగా ఉంటోంది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు వ్యాధి నివారణకు నడుం బిగించారు. అవగాహన కల్పనకు చర్యలు చేపట్టారు. వైద్యశిబిరాలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని పరిస్థితిపై కథనం.

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలలో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెమడ పరీక్షించి వ్యాధి ఉన్నది లేనిది నిర్ధారిస్తున్నారు. ఒకవేళ ఉన్నట్లు తేలితే మందులు అందిస్తున్నారు. వారి కుటుంబంలోని సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బాధితుల నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. నిక్షయ్‌ పోషణ్‌ యోజన కింద నెలవారీ రూ.500 పింఛన్‌ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది.

ప్రత్యేక వైద్యశిబిరాలు

వికారాబాద్‌ జిల్లాలో 5 చోట్ల పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వికారాబాద్‌ పరిధి అనంతగిరిలో క్షయ, ఛాతి వ్యాధుల నివారణ ఆసుపత్రి ఉంది. 1947లో దీన్ని ఏర్పాటుచేయగా.. ప్రస్తుతం 417 మంచాలు ఉన్నాయి. క్షయ రోగానికి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు పంపిణీ చేస్తుండటంతో ఇక్కడికొచ్చే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. క్షయ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో 21 రోజలు పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. దీర్ఘకాలికంగా దగ్గు, దమ్ముతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నామని, వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌ తెలిపారు.

కేసుల నిర్ధారణలో జిల్లా ప్రథమం

గతేడాది టీబీ కేసుల నిర్ధారణలో సిద్దిపేట జిల్లా విభాగం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నెల 20న హైదరాబాద్‌లోని టీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పురస్కారం అందుకుంది. జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. సిద్దిపేటలోని జిల్లా టీబీ క్లినిక్‌లో సీబీ నాట్‌, గజ్వేల్‌, దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రూనాట్‌ పరీక్షలు చేసే సదుపాయం ఉంది. మరోవైపు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 150 మందికి ప్రతి నెలా పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నారు.


స్వచ్ఛంద సంస్థ చేయూత..

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు, జోగిపేట ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 4432 మందికి పింఛన్‌ అందుతోంది. అత్యధికంగా పరిశ్రమలు పటాన్‌చెరు, సదాశివపేట ప్రాంతాల్లో టీబీ అలర్ట్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ప్రత్యేకంగా ఆటోలు ఏర్పాటు చేసి అనుమానితులను ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేయించి, మందులు సరఫరా చేస్తోంది. జిల్లాలో వ్యాధి నివారణకు వైద్య కళాశాల విద్యార్థులు, ఎన్‌జీవో స్వచ్ఛంద సంస్థల దాతల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత జిల్లా అధికారి రాజేశ్వరి వివరించారు.


దాతల సహకారం..

అల్లాదుర్గంలో..

మెదక్‌ జిల్లాలో స్క్రీనింగ్‌ పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటంతో పాటు నివారణ చర్యలు పకడ్బందీగా చేపడుతున్నారు. 2022లో జిల్లాలో 1,684 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 416 మంది బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరికి పూర్తిగా తగ్గే దరకు ఔషధాలు అందిస్తున్నారు. ప్రతి నెలా ఒక్కో పీహెచ్‌సీ పరిధిలోని రెండు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండే గ్రామాల్లో శిబిరాలు నిర్వహించడంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్నారు. ఆయా పీహెచ్‌సీలలో దాతల సహకారంతో బాధితులకు ఆహారం అందిస్తున్నారు. బియ్యం, నూనె, పప్పు, గుడ్లు పంపిణీ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని