logo

లఘు చిత్రం.. సమాజ హితం

ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో పాఠం చెప్పడమే కాకుండా సామాజిక బాధ్యతగా లఘుచిత్రాలతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.. మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం విశేషం.

Published : 24 Mar 2023 01:11 IST

ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో పాఠం చెప్పడమే కాకుండా సామాజిక బాధ్యతగా లఘుచిత్రాలతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.. మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం విశేషం. ఆయనే హత్నూర మండలం సాదుల్‌నగరల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మడె లోకనాథం. ఈయనది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామం. తల్లిదండ్రులు భానుమతి, పాపారావు. వీళ్లు కష్టపడి చదివించగా.. టీటీసీ పూర్తి చేసి 23 ఏళ్లకే ఉపాధ్యాయుడి కొలువు సాధించారు లోకనాథం. 2012లో సాదుల్‌నగర్‌కు వచ్చారు. ఆ తర్వాత బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. విద్యార్థుల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా లఘుచిత్రాల రూపకల్పనకు అడుగేశారు. చేయూత, డ్రీమ్‌ డెత్‌, నా దేశం నడుస్తోంది రక్తపు అడుగుల్లో.., జీవితం వెక్కిరించింది నాలుగు చిత్రాలు రూపొందించారు. ఇవన్నీ సామాజిక అంశాలపై తీసినవే. ఈ క్రమంలో ప్రకృతిని అక్రమార్కులు ధ్వంసం చేస్తున్న తీరు, రసాయనాలతో భూసారం తగ్గిపోతున్న తీరుపై ‘ప్రకృతి పిలుస్తోంది’ పేరిట లఘు చిత్ర రూపకల్పనలో నిమగ్నమయా’్యరు. దీన్ని త్వరలో విడుదల చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. మరోవైపు నాలుగేళ్ల కిందట ఓ బాలికను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో చదివిస్తున్నారు. ఇక పిల్లలకు అర్థమయ్యేలా బోధించడం ఈయనుకున్న అలవాటు. ప్రయోగాత్మకంగా బోధిస్తున్నందుకు అవార్డులు సైతం అందుకున్నారు. ప్రజల్లో కొంతైనా మార్పు తీసుకురావడమే లక్ష్యంగా లఘు చిత్రాలు తీశానని, బోధనతో విద్యార్థులకు సముచిత న్యాయం చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నానని చెప్పుకొచ్చారీ ఉపాధ్యాయుడు లోకనాథం.

న్యూస్‌టుడే, హత్నూర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని