logo

యాప్ కు తోడుగా..పారదర్శకంగా..

మహిళలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.

Published : 29 Mar 2023 02:12 IST

పక్కాగా పొదుపు సంఘాల లెక్కలు, సమావేశాలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, తాండూరు, పాపన్నపేట

మహిళా సంఘం సభ్యుల సమావేశం

మహిళలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇందులో ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అభ్యున్నతి దిశగా అడుగులు వేస్తున్నారు. పొదుపు సంఘాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. సంఘాల ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు ఇక నుంచి ఆన్‌లైన్‌ బాట పట్టనున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రక్రియ సాగే తీరు, కలిగే ప్రయోజనాలపై కథనం.

ఉపాధి దిశగా..

సంఘాల సభ్యులు సమష్టిగా పొదుపు చేసుకోవడంతో పాటు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీరి ఆసక్తిని గమనించిన బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సైతం స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తోంది. ఈ తరుణంలో సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా ప్రత్యేకంగా సెర్ప్‌ ప్రొఫైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అంతర్జాలంలో లెక్కలు..

మహిళా సంఘాల సభ్యులకు సంబంధించిన పొదుపులు, రుణాలు, రుణవాయిదాలు తదితర లెక్కలన్నీ అంతర్జాలంలో నమోదు ప్రక్రియ నాలుగు జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. సంఘానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పొదుపులు, ఇందులోంచి సభ్యులకు ఇచ్చిన అంతర్గత రుణాలు, వసూలు వివరాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. సభ్యుల వారీ వివరాలు సైతం ఉంటాయి.

సమావేశాల వివరాలు..

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఎన్నో సంఘాలు ముందంజలో నిలిచాయి. ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. మెదక్‌ జిల్లాలో మంజీరా పేరిట వివిధ వస్తువులను విక్రయిస్తూ లాభాల బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మహిళా రైతులతో కలిసి కందిపప్పు, ఇతర ఆపరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విక్రయిస్తోంది. ఇలా పలు సంఘాలు అభ్యున్నతి ఓ వైపు అడుగేస్తుండగా మరోవైపు కొన్ని చోట్ల సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రతినెలా నిర్వహించే రెండు సమావేశాల చిత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సిందే. పాత చిత్రం అప్‌లోడ్‌కు వీల్లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.

రుణాలు, గ్రేడింగ్‌కు ప్రామాణికం

ప్రస్తుతం బ్యాంకు, స్త్రీ నిధి రుణాల మంజూరు సమయంలోనే మహిళా సంఘాల సభ్యులు ఒక చోట చేరుతున్నారు. కొత్త విధానం ప్రకారం సమావేశాలు సక్రమంగా నిర్వహించిన సంఘాలకే బ్యాంకు రుణాలు అందుతాయి. స్త్రీనిధి రుణాలకు సైతం ఇదే వర్తిస్తుంది. యాప్‌లో పక్కాగా వివరాలు నమోదు చేసిన వారికి గ్రేడింగ్‌ ఇస్తారు. అన్ని కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తిస్తేనే మంచి గ్రేడింగ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే రుణాలు అందుతాయి. ఆయా సంఘాలకే రుణాల కోసం ఐకేపీ సిబ్బంది బ్యాంకు అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు.


సమగ్ర సమాచారం..
సూర్యారావు, అదనపు డీఆర్డీవో, సంగారెడ్డి

మహిళా సంఘాలకు సంబంధించి సమగ్ర సమాచారం అంతర్జాలంలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆధార్‌, చిత్రాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నాం. సంఘాలకు సంబంధించిన వివరాలన్నీ ప్రతినెలా యాప్‌లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. చిత్రం అప్‌లోడ్‌ తప్పనిసరి కావడంతో సభ్యులందరూ హాజరవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని