logo

హత్యకు దారి తీసిన చరవాణి చోరీ

చరవాణి చోరీ విషయంలో తలెత్తిన గొడవ యువకుడి హత్యకు దారి తీసింది. ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలోని బాలాజీనగర్‌లో ఉండే భానుప్రసాద్‌(25) ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేసేవాడు

Published : 29 Mar 2023 02:12 IST

నిందితులను పట్టుకున్న పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ సురేందర్‌రెడ్డి

గుమ్మడిదల, న్యూస్‌టుడే: చరవాణి చోరీ విషయంలో తలెత్తిన గొడవ యువకుడి హత్యకు దారి తీసింది. ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలోని బాలాజీనగర్‌లో ఉండే భానుప్రసాద్‌(25) ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేసేవాడు. ఈనెల 14న స్నేహితుడు ఫోన్‌ చేశాడని ఇంటినుంచి వెళ్లిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోడంతో మరసటి రోజు స్నేహితుల ఇళ్ల వద్ద వెదికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. 19న మధ్యాహ్నం బాలాజీనగర్‌ శివారులోని ఈత పొదల మధ్య కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో భానుప్రసాద్‌ కుటుంబ సభ్యులకు ఐడీఏ బొల్లారం పోలీసులు సమాచారం ఇచ్చారు. దుస్తులనుబట్టి మృతదేహం భానుప్రసాద్‌దిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఏ స్నేహితుల వద్దకు వెళ్లింది చరవాణి కాల్‌డేటా, లొకేషన్లను పరిశీలించారు. బొల్లారానికి చెందిన వారే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భానుప్రసాద్‌ ఇంటి దగ్గరే నివసించే బీహార్‌ రాష్ట్రానికి చెందిన సందేశ్‌ కుమార్‌, వికాస్‌కుమార్‌ హత్యకు పాల్పడినట్లు భావించారు. వారిని పట్టుకున్న పోలీసులు లోతుగా ఆరా తీయగా.. హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నెల రోజుల కిందట హతుడి తండ్రి బాల్‌రాజ్‌ తప్పతాగి పడిపోగా.. ఆయన మిత్రుడు సందేశ్‌కుమార్‌ సాయంతో ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో బాల్‌రాజ్‌ చరవాణి పడిపోవడంతో సందేశ్‌కుమార్‌ తీసుకున్నాడని అనుమానించిన భానుప్రసాద్‌ స్నేహితులతో కొట్టించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న సందేశ్‌కుమార్‌, ఆయన మిత్రుడు వికాస్‌కుమార్‌తో కలిసి అతడిని చంపడానికి పథకం రచించాడు. 14న మద్యం తాగుదామని భానుప్రసాద్‌ను సందేశ్‌కుమార్‌ ఫోన్‌ చేసి బాలాజీనగర్‌ శివారులోకి రావాలని పిలిచాడు. అప్పటికే అక్కడున్న వికాస్‌కుమార్‌తోపాటు అందరూ మద్యం తాగారు. అతడిని పొదల మధ్యకు తీసుకెళ్లి తలపై మందు సీసాతో కొట్టడంతో స్పృహ కోల్పోగానే బురదలో పడేశారు. బతికి ఉన్నాడని భావించి వెంట తెచ్చిన కత్తితో గొంతు కోసి హతమార్చారు. హత్యకేసు నిందితులిద్దర్నీ అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని