logo

మంత్రి ఆదేశించినా.. అధికారుల నిర్లక్ష్యం

జాతీయ రహదారి 65 పక్కన ప్రవహిస్తున్న మురుగు కాలువలను తలపిస్తోంది. దీనివల్ల రోడ్డు కుచించుకుపోవడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి.

Published : 30 Mar 2023 02:36 IST

జాతీయ రహదారి వెంట నామమాత్రంగా పనులు

ఈనాడు, సంగారెడ్డి: జాతీయ రహదారి 65 పక్కన ప్రవహిస్తున్న మురుగు కాలువలను తలపిస్తోంది. దీనివల్ల రోడ్డు కుచించుకుపోవడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనెల 6న సంగారెడ్డి పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని గమనించారు. తక్షణం సమస్య పరిష్కరించాల్సిందిగా పంచాయతీ, పురపాలిక అధికారులను ఆదేశించారు. మరోసారి వచ్చేసరికి పూర్తిస్థాయిలో పనులు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు కొన్ని చోట్ల మొక్కుబడిగా పనులు చేసి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మురుగు ప్రవహించేందుకు పైపులు వేయాల్సిన అధికారులు చాలా చోట్ల తవ్వి అలాగే ఉంచారు. రోడ్డుపై పోసిన మట్టికుప్పల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారమేర్పడింది. కంది చౌరస్తా దాటిన తర్వాత నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మధ్యదూరంలో రెండు చోట్ల మలుపులు తీసుకునే అవకాశం ఉంది. వాహనాల వేగం తగ్గించేందుకు వీలుగా సూచికలు, ఏర్పాట్లు ఉండాలి. ఈ దిశగా ఎలాంటి చర్యలు లేవు. ఇటీవల సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్‌ కుమారుడు ప్రశాంత్‌ ఈ మార్గంలోనే మృత్యువాతపడ్డారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు దృష్టికి అక్కడే ఉన్న కొందరు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రహదారి పక్కనే లారీలు నిలపడం, ఇసుక నింపుతుండటంతో రోడ్డు వెంట ఆ ఇసుక ప్రమాదకరంగా నిలుస్తోంది. పూర్తిగా మట్టితో నిండిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రెండు కిలోమీటర్ల పొడవునా పనులు పూర్తయ్యేలా చూడాలని, ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

రోడ్డు పక్కనే ఇసుక విక్రయాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని