logo

‘పర్యటక కేంద్రంగా పోచారం అభయారణ్యం’

పోచారాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌  రాజర్షిషా అన్నారు. బుధవారం పోచారం అభయారణ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాల నీటిపారుదల శాఖ, రెవెన్యూ...

Published : 30 Mar 2023 02:38 IST

అటవీ వివరాలను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షి షా

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: పోచారాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌  రాజర్షిషా అన్నారు. బుధవారం పోచారం అభయారణ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాల నీటిపారుదల శాఖ, రెవెన్యూ, అటవీ శాఖ, పర్యాటక శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, భూములు ఏ జిల్లా పరిధిలోకి వస్తాయే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెదక్‌ జిల్లా పరిధి 8 ఎకరాల రెవెన్యూకు సంబంధించిన భూమిని, ప్రాజెక్టు మధ్యలో ఉన్న ద్వీపంలో ఉన్న 15 ఎకరాల కామారెడ్డి జిల్లాకు సంబంధించిన భూమిని పర్యటక శాఖకు అప్పగించి వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఫారెస్ట్‌ ఫ్లస్‌ రిజినల్‌ డైరెక్టర్‌ సాయిలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి రమేష్‌, పర్యటక శాఖ ఓఎస్‌డీ సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ యోసయ్య, కామారెడ్డిజిల్లా ఎస్‌ఈ విద్యావతి, ఈఈ శ్రీనివాసరావు, డీఎఫ్‌వో రవిప్రసాద్‌, ఆర్డీవో సాయిరాం, ఎఫ్‌ఆర్‌వో మనోజ్‌, ఎంపీఈవో శ్రీరాం, తహసీల్దారు నవీన్‌కుమార్‌ ఉన్నారు.

పరీక్షలపై సమీక్ష

మెదక్‌: వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆయా జిల్లాల పాలనాధికారులు, ఎస్పీలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో పాలనాధికారి, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ పాల్గొన్నారు.

అప్రమత్తతతోనే క్షయ నివారణ

సరైన సమయంలో క్షయను గుర్తించడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో క్షయ వ్యాధిపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, మందులను అందజేస్తున్నామని, కోర్సును క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి చందునాయక్‌ మాట్లాడుతూ వ్యాధి నివారణలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన సిబ్బందిని కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో వైద్యశాఖ ఉపసంచాలకులు వెంకటేశం, క్షయ ప్రోగ్రాం అధికారి మాధురి, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయనిర్మల, వైద్యులు మణికంఠ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు