logo

హమ్మయ్యా.. ఉపాధి కూలీ పెరిగింది

రెండేళ్లుగా వేసవి భత్యం చెల్లింపును నిలిపివేసిన కేంద్రం.. ఉపాధి కూలీలకు దినసరి కూలీ రేట్లను పెంచింది.

Published : 01 Apr 2023 01:41 IST

నేటి నుంచి అమలు
న్యూస్‌టుడే, మెదక్‌

రెండేళ్లుగా వేసవి భత్యం చెల్లింపును నిలిపివేసిన కేంద్రం.. ఉపాధి కూలీలకు దినసరి కూలీ రేట్లను పెంచింది. రానున్న రెండు, మూడు నెలలు పనులు జోరుగా కొనసాగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కూలీలకు కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించే వెసులుబాటు ఉండగా, ప్రస్తుత తరుణంలో పెద్దసంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థికసంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన రేటు ప్రకారం కూలీ చెల్లించనున్నారు.

30 వేల మంది..

వలసల నివారణకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. ఉన్న ఊర్లోనే పనులు చేసుకునే అవకాశంతో పాటు కుటుంబ సభ్యులంతా పనులు చేసే వెసులుబాటు ఉంది. జిల్లాలో 1,60,692 జాబ్‌కార్డులు ఉన్నాయి. కూలీలు 3,22,816 మంది ఉన్నారు. ప్రస్తుతం నిత్యం 30 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) విధానంతో ఇబ్బందులు ఎదురవగా కూలీల సంఖ్య తగ్గింది. చేసిన పనులకు కూలి చెల్లించేందుకు జాబ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసింది.

మూడు నెలలు..

ఏటా మార్చి నుంచి జూన్‌ వరకు సాగు పనులు తక్కువగా ఉండటం వల్ల పనులకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో నిర్దేశించుకున్న లక్ష్యం ఆధారంగా వచ్చే మూడు నెలల్లో ఎక్కువ శాతం పనుల పూర్తికి అధికారులు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం రోజు వారి కూలి రూ.257 ఉండగా, ఏప్రిల్‌ 1 నుంచి రూ.272 చెల్లించనున్నారు. ప్రస్తుతం సగటు కూలీ రూ.171 అందుతోంది. మండుటెండల్లో పనులు చేయాల్సి ఉండటంతో కేంద్రం వేసవి ప్రత్యేక భత్యం చెల్లించేది. ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం వరకు అదనంగా ఇచ్చే వారు. గతేడాది నుంచి దీన్ని కేంద్రం నిలిపివేసింది. ఈ తరుణంలో ఇప్పుడు పెరిగిన భత్యం ఊరటనిచ్చే అంశం.

47.18 లక్షల పని దినాలు

2023-24 ఆర్థిక సంవత్సరంలో 47.18 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతంలో చేసిన పనుల కొలతల చిత్రం వారానికోసారి తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. కొత్త విధానం ప్రకారం రోజుకు రెండు సార్లు చిత్రాలు తీసి ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. వేసవి నేపథ్యంలో ఉదయాన్నే వచ్చి కొలతల ప్రకారం పనులు చేసుకుని వెళ్తున్న కూలీలు, మధ్యాహ్నం మళ్లీ పనుల వద్దకు వచ్చి ఫొటో తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీన్ని తొలగించాలని కూలీలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని