logo

అడవిలో జల సంపదకు నిర్మాణాలు

అటవీ శాఖ అంటే అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షించడమే కాదు. విధి నిర్వహణ దృష్ట్యా ఆ పని చేస్తూనే విధుల నేల సంరక్షణతో పాటు భూ గర్భ జలాలను పెంపునకు కృషి చేస్తున్నారు.

Published : 01 Apr 2023 01:41 IST

బహుళ ప్రయోజనాలకు వేసవిలో చర్యలు
న్యూస్‌టుడే: హుస్నాబాద్‌ గ్రామీణం

కోహెడ మండలం శనిగరం అడవుల్లో నిర్మించిన చెక్‌డ్యాం

అటవీ శాఖ అంటే అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షించడమే కాదు. విధి నిర్వహణ దృష్ట్యా ఆ పని చేస్తూనే విధుల నేల సంరక్షణతో పాటు భూ గర్భ జలాలను పెంపునకు కృషి చేస్తున్నారు. ఇందుకు హుస్నాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో చేపడుతున్న చర్యలే ఇందుకు చక్కని నిదర్శనం. ఈ చర్యల ద్వారా అడవుల్లో పెరిగే చెట్లకు నీరందడంతో పాటు వన్యప్రాణులు దాహం తీర్చుకోవచ్చు. హుస్నాబాద్‌ అటవీక్షేత్ర (ఫారెస్ట్‌ రేంజ్‌) పరిధిలో హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట, బెజ్జంకి మండలాలు ఉన్నాయి. మొత్తం 4065 హెక్టార్లలో అడవుల విస్తీర్ణం ఉంది. ఇందులో హుస్నాబాద్‌, శనిగరం, ఆకునూర్‌, మీర్జాపూర్‌, చుంచనకోట 1, చుంచనకోట 2, నాగపురి, గురువన్నపేట బీట్‌లు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతూనే నేల సంరక్షణ, భూగర్బ జలాలను పెంచేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో నీరు ఎత్తు నుంచి పల్లపు ప్రాంతానికి ప్రవహించి వెళ్లిపోతుంది. నేల కోతకు గురవుతుంది. భూసారం తగ్గుతుంది. చెట్ల వేళ్లు పైకి తేలి, ఈదురు గాలులకు కూలుతాయి. నీటి నిల్వ లేకపోవడంతో వేసవిలో వన్యప్రాణులకు నీరు దొరకదు. దాహం తీర్చుకోవడానికి జనావాసాల వైపు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతుంటాయి. వీటన్నింటినీ నివారించేందుకు ‘సాయిల్‌ అండ్‌ మాయిశ్చర్‌ కన్జర్వేషన్‌’లో భాగంగా అడవుల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు 50 రోజులుగా వివిధ నిర్మాణాలు చేపట్టారు.

భూగర్బ జలాలు పెంచే చర్యలు

అడవుల్లో భూగర్బ జలాలను పెంచేందుకు బహుళ ప్రయోజన చర్యలు చేపడుతున్నారు. మొదట ఎక్కువ నీటిని నిల్వ చేసేందుకు అనువైన లోతట్టు ప్రాంతాలను గుర్తిస్తున్నారు. వర్షపు నీటికి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి నిల్వ చేసేందుకు చెక్‌డ్యాంలు, ట్యాంకులు, ఫాంపాండ్స్‌, గుట్టల చుట్టూ కాంటూరు కందకాలు తవ్వుతున్నారు. కోహెడ మండలం శనిగరం పరిధిలో ఒక చెక్‌డ్యాం పూర్తి చేశారు. పర్క్యులేషన్‌ ట్యాంకులు 5, ఫాంపాండ్స్‌ 3 తవ్వించారు. చేర్యాల పరిధిలో 2 ఫాంపాండ్స్‌ తవ్వించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో అందులోకి నీరు చేరింది. హుస్నాబాద్‌ పరిధిలో అటవీ భూమిని ఇతరులు ఎవరూ ఆక్రమించకుండా ఉండేందుకు హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

అక్కన్నపేట మండలం రేగొండలో తవ్వించిన ఫాంపాండ్‌లో నిలిచిన నీరు


వేసవిలో అనుకూలం

సందీప్‌కుమార్‌, హుస్నాబాద్‌ ఎఫ్‌ఆర్‌వో

వేసవికాలంలో చెక్‌ డ్యాంలు, పర్క్యులేషన్‌ ట్యాంకులు, ఫాంపాండ్స్‌ నిర్మించేందుకు అనువైన సమయం. అందుకే వీటి నిర్మాణం చేపట్టాం. ఇప్పటివరకు పదకొండు వర్షపు నీటిని నిల్వ చేసే పనులు చేపట్టాం. దాదాపు అన్నీ పూర్తి కావచ్చాయి. అకాల వర్షాలతో కొంతవరకు నీరు చేరింది. వీటితో పాటు వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు గతంలో అడవుల్లో నిర్మించిన సాసర్‌ పిట్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. ప్రస్తుత నిర్మాణాలతో వర్షపు నీటిని నిల్వ చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని