logo

‘యాప్‌’ వేసుకొని.. సైబర్‌ వలలో చిక్కి

సిద్దిపేట మూడో పట్టణ ఠాణా పరిధిలో ఓ వ్యక్తికి సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి పేటీఎం ద్వారా రూ.5 లక్షల రుణం మంజూరైందని దానికోసం రస్క్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించాడు.

Published : 01 Apr 2023 01:39 IST

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట మూడో పట్టణ ఠాణా పరిధిలో ఓ వ్యక్తికి సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి పేటీఎం ద్వారా రూ.5 లక్షల రుణం మంజూరైందని దానికోసం రస్క్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించాడు. నమ్మిన బాధితుడు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని వివరాలు నమోదు చేయగానే రూ.1,43,749 కోల్పోయాడు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తికి మర్చంట్‌ ప్లేస్‌ సంస్థ పేరుతో చరవాణికి సందేశం రాగా అందులో వివరాలు నమోదు చేశాడు. వెంటనే అతని అకౌంట్‌ నుంచి రూ.25 వేలు డెబిట్‌ అయ్యాయి. భూంపల్లి-అక్బర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి రూపే రుణ యాప్‌లో ద్వారా రుణం తీసుకుని డబ్బులు చెల్లించాడు. ఓ నేరగాడు ఫోన్‌ చేసి మళ్లీ డబ్బులు కట్టాలని, లేకపోతే వివరాలు తమ దగ్గర ఉన్నాయని బెదిరించటంతో రూ.24,990 చెల్లించాడు. తర్వాత ఫోన్‌ చేస్తే స్పందన కరువైంది. జగదేవపూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తికి సైబర్‌నేరగాడు ఫోన్‌ చేసి తమ సంస్థలో రూ.4999 విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే లాప్‌టాప్‌ ఉచితంగా వస్తుందని నమ్మించాడు. దీనికోసం ప్రాసెసింగ్‌ ఛార్జీ, జీఎస్టీ కింద డబ్బులు చెల్లించాలని కోరగా రూ.24,980 చెల్లించాడు. తర్వాత ఫోన్‌చేస్తే స్పందన రాలేదు. పట్టణ మూడవ ఠాణా పరిధిలో ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా హనీట్రాప్‌ చేసి రూ.2800 కాజేశాడు. ముందుగా ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపగా బాధితుడు దాన్ని యాక్సెప్ట్‌ చేశాడు. వెంటనే సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి న్యూడ్‌ కాల్‌ చేశావని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయగా భయపడిన బాధితుడు సదరు సొమ్ము పంపించి కోల్పోయాడు. పై కేసుల్లో సంబంధిత బాధితులందరూ 1930కి ఫిర్యాదు చేశారు. సిద్దిపేట వన్‌టౌన్‌, భూంపల్లి ఠాణా పరిధుల్లో ఇటీవల జరిగిన సైబర్‌ నేరాల్లో శుక్రవారం రూ.75,108 నిలుపుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని