logo

పనుల్లో తాత్సారం ఏళ్లుగా నిర్మాణం!

గ్రామీణుల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ఇబ్బందులు తీర్చేందుకు వివిధ భవనాలు నిర్మించేలా ప్రోత్సహిస్తున్నాయి.

Published : 01 Apr 2023 01:41 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జిన్నారం, హత్నూర

గ్రామీణుల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ఇబ్బందులు తీర్చేందుకు వివిధ భవనాలు నిర్మించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఆయా నిర్మాణాలు ఏళ్లుగా పూర్తికావడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ), జిల్లా ప్రజా పరిషత్‌, ఎస్‌డీఎఫ్‌ తదితర నిధులతో ఈ పనుల చేపట్టగా.. పంచాయతీ రాజ్‌ శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ పనుల్లో తీవ్ర జాప్యంపై కథనం.

నిబంధనల విస్మరణ

గుత్తేదారుతో ఒప్పందం జరిగిన ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నా.. జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. తొలుత గుత్తేదారు ఆర్భాటంగా ముందుకు వస్తున్నా.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. సకాలంలో బిల్లులు రాకపోవడమూ కారణనే విమర్శలున్నాయి.


అదనపు నిధులు కావాలని ప్రభుత్వానికి నివేదించాం

జగదీశ్వర్‌, పీఆర్‌ ఈఈ

జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన నిర్మాణాలు చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. వాటి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అదనపు నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేస్తాం.


పిల్లర్ల స్థాయి దాటని తరగతి గదులు

జిన్నారం మండలం వావిలాలలో రూ.30 లక్షల నిధులను ప్రాథమిక పాఠశాల భవనానికి మంజూరు చేశారు. అయిదు గదులుగా నిర్మించాలి. అయిదేళ్ల క్రితమే నిధులు మంజూరు చేయగా అప్పట్లో గుత్తేదారు ఆర్భాటంగా పనులు చేపట్టారు. పిల్లర్ల వరకు పూర్తి చేసి అయిదేళ్లు అవుతున్నా.. ఎలాంటి పురోగతి లేదు. గుత్తేదారు పనులను రద్దు చేసి ఇతరులకు టెండర్ల ద్వారా కేటాయించాల్సి ఉన్నా.. సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. నిర్మాణం అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.


కొన్ని చోట్ల నిధుల కొరత

హత్నూర మండలం కాసాలలో..

* హత్నూర మండలం కాసాల శివారులో షాదీఖానా నిర్మాణానికి రూ.7 లక్షలతో పనులు చేపట్టారు. ఆ భవనం పిల్లర్ల దశ వరకు వేగంగా పూర్తి చేసినా.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. 15 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిధుల కొరతతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి స్పందన లేదు.
* సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లో బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. స్లాబ్‌ వరకు పనులు చేసి వదిలేశారు. సరిపడా నిధులు లేకపోవడంతో ఆరేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. కొండాపూర్‌, కంది, సదాశివపేట మండలాల్లోనూ అసంపూర్తి భవనాలు, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చేపి భవనాలు వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని