logo

లక్ష్యం.. ఆరోగ్య కార్మిక లోకం

భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులవి రెక్కాడితో కానీ డొక్కాడని బతుకులు. అకస్మాత్తుగా కుటుంబ పెద్ద అనారోగ్యం బారిన పడితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది.

Updated : 01 Apr 2023 04:44 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, గజ్వేల్‌ గ్రామీణ, చేగుంట, పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీ

భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులవి రెక్కాడితో కానీ డొక్కాడని బతుకులు. అకస్మాత్తుగా కుటుంబ పెద్ద అనారోగ్యం బారిన పడితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వ్యాధిని ముందే గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించడం సులభంగా ఉంటుంది. ఈ తరుణంలో వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా నిర్మాణ రంగ కార్మికులందరికీ వైద్య పరీక్షలు చేపట్టారు.

ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రాలను విస్తరిస్తుండటంతో వివిధ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పురపాలికల్లో బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. స్థానికంగా సరిపడా దొరక్క వేరే జిల్లాల నుంచి రప్పించి పనులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు కార్మికుల కొరత వేధిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో పరిగి, కొడంగల్‌ తదితర చోట్ల నుంచి హైదరాబాద్‌ వంటి మహానగరాలకు తరలివెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చేగుంటలో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు

23 రకాలు..

భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలిలో నమోదైన కార్మికులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే సదరు ప్రక్రియ ప్రారంభమైంది. రక్తపోటు, రక్త చక్కెర, చెవి, కంటి, రక్త, ఊపిరితిత్తుల పనితనం తదితర 23 రకాల పరీక్షలు చేస్తున్నారు. గుండె సంబంధ సమస్యల్ని గుర్తించేందుకు ఈసీజీ సైతం తీస్తారు. అయితే ఆధార్‌ కార్డు, నిర్మాణరంగ కార్మికుల కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. సిద్దిపేట జిల్లాలో ఏప్రిల్‌ నుంచి మొదలుపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మెదక్‌ జిల్లాలోనూ ఈ నెల తొలి వారంలో షురూ కానుంది. వికారాబాద్‌లో శిబిరాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు.

కార్మికుల చెంతకే..

కార్మికులకు ఇబ్బందులు లేకుండా వారి సొంత గ్రామాల్లోనే శిబిరాలు నిర్వహించనున్నారు. నిర్మాణ కార్మికుల కార్డులు ఎక్కువగా ఉన్న గ్రామాల జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఓవైపు పరీక్షలు చేయడంతోపాటు కార్డులు సైతం అందజేయనున్నారు. స్కోప్‌ స్వచ్ఛంద సంస్థ సైతం కార్మికుల వద్దకు వెళ్లి పరీక్షించేందుకు ముందుకొచ్చింది. దీనిపై గత జనవరి 31న సంబంధిత అధికారులతో వర్క్‌షాప్‌ సైతం నిర్వహించింది. విధి విధానాలు ఖరారు చేసింది.

సలహాలు, సూచనలు..సిఫారసు

సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాల ఆధారంగా కార్మికులకు వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు. చికిత్సల అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవల సద్వినియోగంపై అవగాహన కల్పిస్తారు.

పరీక్షలు నిర్వహిస్తూ.

ప్రత్యేక ఆసుపత్రులు ఉంటే మేలు

నిర్మాణరంగ కార్మికుల్లో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పనిచేసే ప్రదేశాల్లో సరైన వసతులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. చర్మ వ్యాధులు, శ్వాస సంబంధ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఆరోగ్య పరీక్షల నిర్ణయం హర్షణీయమని, చికిత్సల కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటుచేస్తే సౌకర్యంగా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లా కార్మికులు (వేలల్లో..)

సంగారెడ్డి 46
సిద్దిపేట 65
మెదక్‌ 22
వికారాబాద్‌ 39


సద్వినియోగం చేసుకోవాలి

యాదయ్య, సహాయ కార్మిక అధికారి, సంగారెడ్డి

సంపూర్ణ ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్మాణరంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటికే అనంతసాగర్‌, తాడ్మనూరు, మర్వెల్లి గ్రామాల్లో శిబిరాలు పూర్తిచేశాం. పరీక్షలు చేసుకోవడం ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే ముందే గుర్తించి జాగ్రత్త పడేందుకు వీలుంటుంది. సీఎస్సీ హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని