logo

నేర వార్తలు

బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రథమ అదనపు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఏసీపీ రమేశ్‌ శుక్రవారం గజ్వేల్‌లో తెలిపారు.

Updated : 01 Apr 2023 04:47 IST

బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

గజ్వేల్‌ గ్రామీణ, జగదేవపూర్‌, న్యూస్‌టుడే: బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రథమ అదనపు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఏసీపీ రమేశ్‌ శుక్రవారం గజ్వేల్‌లో తెలిపారు. జగదేవపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(4)కు చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపి తిమ్మాపూర్‌ గ్రామవాసి పోసానిపల్లి రమేశ్‌ తరచూ లైంగికంగా వేధించేవాడు. 18 నవంబరు 2021న బాలిక అస్వస్థతకు గురైంది. ఆరు రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగదేవపూర్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీపీ శ్వేత చొరవతో, కేసును వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానం విచారణ నిర్వహించింది. నిందితుడికి శిక్ష విధించింది. ఇందుకు కృషిచేసిన పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.  


అడవిలో మహిళ అస్థిపంజరం

పూడూరు, న్యూస్‌టుడే: పూడూరు మండలం సోమన్‌గుర్తి అటవీ ప్రాంతంలో మహిళ అస్థిపంజరం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. సోమన్‌గుర్తికి చెందిన కూలీలు శుక్రవారం ఉదయం ఉపాధి పనులు చేసేందుకు వికారాబాద్‌ అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, అస్థిపంజరాన్ని గుర్తించారు. వీఆర్‌ఏ రామకృష్ణ ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ వెంకటరామయ్య, తహసీల్దారు మోహన్‌, ఎస్సై విఠల్‌రెడ్డి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాజు ముక్కలు, మద్యం సీసా, అగ్గిపెట్టెను గుర్తించారు. వారం రోజుల కిందట మహిళను హత్య చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉంటారని, లేదా ఎక్కడో చంపి ఇక్కడ దహనం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


కేసు భయంతో ప్రాణం తీసుకున్నాడు!

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తనపై కేసు నమోదు అవుతుందేమోననే భయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జహీరాబాద్‌ పట్టణ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. కర్ణాటకలోని కలబురిగి జిల్లా చించోళి తాలూకా కుంచారం గ్రామానికి చెందిన గడ్డమీది శ్రీకాంత్‌(28) ద్విచక్ర వాహనంపై జహీరాబాద్‌ వస్తుండగా గురువారం రాత్రి పట్టణంలోని రాంనగర్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. తదుపరి ఆయన గతంలో పనిచేసిన చెన్నారెడ్డినగర్‌ కాలనీ వాటర్‌ ప్లాంట్‌ వద్దకు వెళ్లి అక్కడే నిద్రించాడు. భయాందోళనలో ఉన్న శ్రీకాంత్‌ ప్రమాద విషయాన్ని కుటుంబీకులకు చెప్పి వాహన మరమ్మ, పరిహారం నిమిత్తం డబ్బులు కావాలని అడగడంతో ‘నువ్వే చూసుకోవాలని’ మందలించారు. ఈ ఘటనలో తనపై పోలీసు కేసు అవుతుందనే భయంతో అదే రాత్రి వాటర్‌ ప్లాంట్‌ షెడ్డుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.


కోనేరులో మునిగి మహిళ మృతి

యాలాల, న్యూస్‌టుడే: మండలంలోని జుంటిపల్లి సీతారామచంద్రస్వామి జాతరలో శుక్రవారం ఉదయం విషాదం నెలకొంది. ఎస్సై అరవింద్‌ తెలిపిన ప్రకారం.. బొంరాస్‌పేట మండలం తుంకిమెట్లకు చెందిన భీమమ్మ(40) గురువారం రాత్రి రేగడిమైలారానికి చెందిన చెల్లెలు సత్యమ్మతో కలిసి జుంటిపల్లి జాతరకు వచ్చారు. రాత్రి ఆలయం వద్దే ఉన్నారు. శుక్రవారం ఉదయం గుట్ట కింద ఉన్న కోనేరులో స్నానానికని దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు భీమమ్మ మునిగిపోయింది. సత్యమ్మ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను బయటికి తీసి, వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందిందని నిర్ధరించారు. సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భీమమ్మకు భర్త రాజు, ఇద్దరు కుమారులు ఉన్నారు.


నీట మునిగి యువకుడు మృతి

కల్హేర్‌: ఎద్దుల బండిని శుభ్రం చేసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి మృతిచెందాడు. కల్హేర్‌ ఎస్సై ప్రశాంత్‌ వివరాల ప్రకారం.. నిజాంపేట్‌ మండలంలోని రాంరెడ్డిపేట్‌ గ్రామానికి చెందిన దిడ్డి బ్యాతయ్య(23) గ్రామంలో జాతర సందర్భంగా ఎద్దుల బండిని శుభ్రం చేసేందుకు గ్రామస్థులతో కలిసి నిజాంసాగర్‌కు వెళ్లాడు. తిరుగు జలాల్లో బండిని శుభ్రం చేశాడు. తర్వాత స్నానం చేసేందుకు కొద్దిదూరం వెళ్లి కాలుజారి గుంతలో పడిపోయాడు. తోడుగా వచ్చినవారు రక్షించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు ప్రభాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


ఖాజీపేటలో మరొకరు మృతి

నర్సాపూర్‌ రూరల్‌: జీవాల దాహం తీర్చేందుకు కుంటలోకి తీసుకెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శివకుమార్‌ తెలిపిన వివరాలు.. నర్సాపూర్‌ మండలం ఖాజీపేటకు చెందిన ప్రభాకర్‌(38), రుక్మిణి దంపతులకు ఓ కుమారుడున్నాడు. ప్రభాకర్‌ పాలు విక్రయిస్తాడు. శుక్రవారం మధ్యాహ్నం గేదెలను తాబేలు కుంటకు నీళ్లు తాగించేందుకు తీసుకెళ్లాడు. అవి ఎంతకీ ఒడ్డుకు రాకపోతుండడంతో కుంటలోకి దిగి మునిగి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు కుటుంబీలకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని