logo

బలిగొన్న రోడ్డ్డు ప్రమాదాలు

ఓ పాఠశాల బస్సు ఢీకొని ఉదయం నడకకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగిలో శుక్రవారం జరిగింది.

Published : 01 Apr 2023 01:41 IST

వేర్వేరు చోట్ల ఐదుగురు మృతి

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి కింద పడి ఇద్దరు చనిపోయారు. అడ్డుగా వచ్చిన శునకాన్ని తప్పించబోయి ఒకరు, కల్వర్టును ఢీకొని మరొకరు మృతి చెందారు. ఉదయం నడకకు వెళ్లిన ఓ పాదచారిని పాఠశాల బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.


ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

పాపన్నపేట, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని లక్ష్మీనగర్‌-జయపురం శివారులో జరిగింది. ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు... గాంధారిపల్లికి చెందిన మిద్దెల సిద్దిరాములు(26) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యతోపాటు కుమారుడున్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పట్నుంచి సిద్దిరాములు ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఓ పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాత్రివేళ వస్తుండగా.. జయపురం-లక్ష్మీనగర్‌ శివారులో ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. తల, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గమనించి చికిత్సకు 108 వాహనంలో మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సిద్దిరాములు సమీప బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


నాగసమందర్‌లో..

ధారూర్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధి నాగసమందర్‌లో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన అమ్రోద్దీన్‌(28) గురువారం సాయంత్రం తన సోదరిని తాండూరు రైల్వేస్టేషన్‌లో వదిలేందుకు వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చే సమయంలో, గ్రామ సమీపంలోకి రాగానే, ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో, అపస్మారక స్థితికి చేరిన అమ్రోద్దీన్‌ను వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందాడని తెలిపారు. భార్య అమ్రిన్‌ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌ కుమార్‌ తెలిపారు.


కుక్కను తప్పించబోయి... దుర్మరణం

గుమ్మడిదల: కుక్కను తప్పించబోయి విభాగానిని ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో శుక్రవారం చోటుచేసుకుంది. గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన వుంద్యాల గోవర్ధన్‌రెడ్డి(48), హనుమాన్‌నగర్‌కు చెందిన నీలావతి ద్విచక్రవాహనంపై గుమ్మడిదల నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్నారు. జాతీయ రహదారి 765డీ దోమడుగు సమీపంలో దారికి కుక్క అడ్డురాగా తప్పించబోయి విభాగినిని బలంగా ఢీకొన్నారు. తలకు, చేతులకు తీవ్ర గాయాలవడంతో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నీలావతికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


కల్వర్టును ఢీకొని డ్రైవరు..

ప్రమాదానికి గురైన వ్యాను

కల్హేర్‌, న్యూస్‌టుడే: వేగంగా వెళుతున్న వ్యాను అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో డ్రైవరు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. కల్హేర్‌ ఎస్సై ప్రశాంత్‌ సమాచారం ప్రకారం.. శుక్రవారం ఉదయం జహీరాబాద్‌ మహీంద్ర సంస్థ నుంచి నిజామాబాద్‌ షోరూంకు కొత్త వ్యాన్లు బయలుదేరాయి. ఓ వ్యాన్‌ను జహీరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ హనీఫ్‌(47) తీసుకెళుతున్నాడు. దారిలో అయిదుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. 161వ నంబరు జాతీయ రహదారిపై బాచేపల్లి శివారులో ఆ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్క కల్వర్టును ఢీకొట్టింది. హనీఫ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఆవిటి లచ్చమ్మ, రాథోడ్‌, రంజిత్‌ నాయక్‌, సమ్మక్క, లక్ష్మి, కళావతిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నారాయణఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


పాదచారిని చిదిమేసిన బడి బస్సు..

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: ఓ పాఠశాల బస్సు ఢీకొని ఉదయం నడకకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగిలో శుక్రవారం జరిగింది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాస్‌ కాలనీకి చెందిన వారాల రాజ్‌కుమార్‌(55) రిజిస్ట్రేషన్‌ కార్యాలయ పరిసరాల్లో టీకొట్టు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా, పిల్లలను పాఠశాలకు తరలిస్తున్న ఓ ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం అతన్ని 20 అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు గమనించి అక్కడికి చేరుకున్నారు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ ఆఖిల్‌ను అరెస్టు చేశామన్నారు.విద్యార్థులను వేరే వాహనంలో పాఠశాలకు తరలించామని చెప్పారు. రాజ్‌కుమార్‌కు భార్య ప్రభావతి, కూతురు, కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని