logo

అన్నదాతల ఆవేదన

లారీల కొరత తీర్చి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలంటూ కౌడిపల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రైతులు ధర్నా చేశారు.

Published : 01 Jun 2023 01:19 IST

లారీల కొరత తీర్చాలని రహదారిపై బైఠాయింపు

కౌడిపల్లి మండల కేంద్రంలో నిరసన తెలుపుతున్న రైతులు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: లారీల కొరత తీర్చి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలంటూ కౌడిపల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రైతులు ధర్నా చేశారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులైన ఏసోబ్‌ ఆధ్వర్యంలో ప్రభాకర్‌, విఠల్‌, ఇలియాజ్‌, శేఖర్‌లతో పాటు మహిళా రైతులు రహదారిపై బైఠాయించారు. కేంద్రానికి ధాన్యం తెచ్చి నెలరోజులైనా ఇంతవరకు కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ను పెట్టి ధాన్యం బస్తాలను ఉంచారు. ధాన్యాన్ని తగలబెట్టి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్‌, మండల అధ్యక్షులు రాకేశ్‌లు బైఠాయించారు. సుమారు గంటపాటు ఆందోళన చేయడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. లారీలను రప్పించి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని తహసీల్దార్‌ కమలాద్రి, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డిలు హామీ ఇవ్వడంతో రైతులు విరమించారు.  

శివ్వంపేట: శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు పంపించాలని రైతులు బుధవారం నర్సాపూర్‌-తూప్రాన్‌ రహదారిపై ధర్నా చేశారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు రైతులతో చరవాణి ద్వారా మాట్లాడి లారీలు పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

రామాయంపేట: వర్షాకాలం సమీపిస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదని, మూడు రోజులుగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రామాయంపేట మండల పరిధి ప్రగతి ధర్మారం గ్రామస్థులు రామాయంపేట-గజ్వేల్‌ రహదారిపై బైఠాయించారు. ధాన్యాన్ని రహదారిపై పోసి నిప్పంటించారు. వాహనాలు వెళ్లకుండా రహదారిపై కట్టెలు అడ్డుగా వేశారు. సుమారు రెండు గంటల పాటు రహదారిపై బైఠాయించారు. సుమారు 70 మంది రైతుల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన సుమారు 5వేల బస్తాలు కేంద్రంలో నిల్వ ఉన్నాయని, లారీలు సకాలంలో రావడంలేదన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించి పంపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని