logo

వేలం పాడారు.. తీసుకోకుండా వదిలేశారు!

వేలంలో పోటీపడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇప్పుడు మాకు వద్దు బాబు అంటూ వదిలేశారు. దీనివల్ల ఏడాదిగా ఆదాయం కోల్పోతుంది. చేగుంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలను రెండేళ్ల క్రితం నిర్మించారు.

Published : 01 Jun 2023 01:19 IST

ఏడాదిలో రూ.7.50 లక్షల ఆదాయం కోల్పోయిన ఏఎంసీ

చేగుంటలో వృథాగా దుకాణాలు

న్యూస్‌టుడే, చేగుంట: వేలంలో పోటీపడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇప్పుడు మాకు వద్దు బాబు అంటూ వదిలేశారు. దీనివల్ల ఏడాదిగా ఆదాయం కోల్పోతుంది. చేగుంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలను రెండేళ్ల క్రితం నిర్మించారు. రూ.55 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టి వృథాగా వదిలేశారు. 2022 మే 24న మార్కెటింగ్‌ శాఖ అధికారులు బహిరంగ వేలం వేశారు. వాటిని కొందరు అధిక మొత్తాలకు దక్కించుకున్నారు. కానీ ఆ దుకాణాలను తీసుకోవటానికి వారు ముందుకు రావడంలేదు. దీనివల్ల ప్రతి నెల ఏఎంసీకి వచ్చే అద్దె రాకుండా పోయింది.

చేగుంటలోని మెదక్‌ ప్రధాన రహదారి వైపు తొమ్మిది, వెనకవైపు తొమ్మిది దుకాణాలను నిర్మించారు. కానీ వాటిని కేటాయించేందుకు కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు మేలో బహిరంగ వేలం వేయగా మెదక్‌ రోడ్డు వైపు ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు. వెనకవైపు కేవలం ఒకే దుకాణం వేలంలో వెళ్లింది. కానీ అధికారులు మాత్రం వాటిని దక్కించుకున్నవారికి మొదట కేటాయించలేదు. కేవలం ఒకే దుకాణం కేటాయించారు. విద్యుత్తు సౌకర్యం లేని కారణంగా వేలంలో దక్కించుకున్నవారు తీసుకోవటానికి ఆసక్తి చూపించలేదు. విద్యుత్తు సౌకర్యం ఏర్పాటుకు ఐదారు నెలలు పట్టింది. ఇప్పుడు వారు తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. దీనివల్ల ప్రతి నెల దాదాపుగా రూ.70 వేల వరకు ఆదాయం ఏఎంసీ కోల్పోతుంది. ఇలా ఏడాదిలో ఇప్పటివరకు సుమారుగా రూ.7.50 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. వేలం పాడి దక్కించుకున్న వారు రూ.15 వేలు ధరావత్తు చెల్లించారు. దుకాణాలను తీసుకోకపోతే ఆ సొమ్ము ఏఎంసీకే ఉండిపోతుంది. ప్రస్తుతం ఒకే దుకాణం రూ.6700 అద్దెకు కొనసాగుతుంది. మిగతావి వృథాగా పడిఉన్నాయి. ఇప్పటికైనా వీటికి మళ్లీ టెండర్లు పిలిచి కేటాయించాల్సిన అవసరం ఉంది.


ముందుకు రావటం లేదు

మొదట్లో విద్యుత్తు వసతి లేక దుకాణాల కేటాయింపులో ఆలస్యం జరిగింది. ఇప్పుడు విద్యుత్తు వసతి కల్పించినా తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. ఫోన్‌లో తెలిపినా ఆసక్తి చూపించడంలేదు. త్వరలోనే నోటీసులు ఇస్తాం. అయినా స్పందించకపోతే  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తిరిగి టెండర్లు పిలిపించే ఏర్పాట్లు చేస్తాం.

ఈశ్వర్‌కుమార్‌, ఏఎంసీ సహాయకులు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని