logo

నాణ్యమైన సేవలు.. ప్రోత్సాహకానికి అర్హులు

ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత, ప్రయోజనాల ఆధారంగా కేంద్రం గుర్తించి ఆసుపత్రులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా శిశు మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి ‘ముస్కాన్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

Updated : 01 Jun 2023 04:59 IST

సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి దక్కిన కేంద్ర పురస్కారం
మూడేళ్లలో రూ.36 లక్షల నజరానా

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత, ప్రయోజనాల ఆధారంగా కేంద్రం గుర్తించి ఆసుపత్రులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా శిశు మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి ‘ముస్కాన్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఎంపికైన ఆసుపత్రులకు నిధులు మంజూరు చేస్తోంది. సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ఎంపిక చేసింది. గత నెల 2 నుంచి 3 వరకు కేంద్ర బృందం సభ్యులు రేణుబాల, ప్రభాకరన్‌ క్షుణ్నంగా పరిశీలించారు. సేవలపై సంతృప్తి చెంది కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో ముస్కాన్‌ పురస్కారానికి ఆసుపత్రి అర్హత సాధించింది. 91 శాతం స్కోరింగ్‌ సాధించినట్లుగా ప్రకటిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం దక్కినందుకు ఒనగూరే ప్రయోజనాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేస్తున్న ముస్కాన్‌ కేంద్ర బృందం సభ్యులు

సంగారెడ్డి జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో 150 పడకల మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఉంది. ఇందులో 100 పడకల వరకు గర్భిణులకు, బాలింతలకు కేటాయించారు. మిగిలిన 50 పడకల్లో చిన్నారులకు వైద్య సేవలందిస్తుంటారు. ఇందులో నవజాత శిశువులకు 20 పడకలు, చిన్నారులకు 10, అత్యవసరంలో చిన్నారులకు 10 పడకలు, పోషకాహారంతో బాధ పడే చిన్నారులకు మరో 10 పడకలు ఉన్నాయి. ఇక్కడ 24 గంటలు కార్పొరేట్‌ స్థాయిలో చికిత్సలు లభిస్తాయి. జటిలమైన సమస్యలతో బాధపడే వారికీ వైద్యులు భరోసా ఇస్తారు. చిన్నారుల ఆసుపత్రి ఓపీకి నిత్యం 60 నుంచి 100 మంది వరకు వస్తుండగా, లోపలి రోగులు 30 నుంచి 50 మంది వరకు ఉంటారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసులే కాకుంగా పక్కనున్న రంగారెడ్డి, వికారాబాద్‌ వాసులూ తరలి వస్తుంటారు.  

నిబంధనల అమలుపై ఆరా

ఎంసీహెచ్‌ భవనం

ప్రధానంగా ఔట్‌, ఇన్‌ పేషెంట్స్‌గా ఉన్న పిల్లలకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరును కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. తక్కువ బరువుతో పుట్టిన వారికి ఉచితంగా పౌష్టికాహారం అందిస్తున్నారా? ఎంత మంది ఉన్నారు? వారి తల్లులకు పౌష్టికాహారంపై కౌన్సెలింగ్‌ తీరుపై బృందం విచారించింది. నవజాత శిశువులకు అందించే సేవలలో ఏవైనా లోపాలున్నాయా? ఇక్కడ వారికి సరైన వైద్యం అందుతోందా? ఇతర ఆసుపత్రులకు పంపించి ఊరుకుంటున్నారా? అనుశీలన పక్కాగా చేస్తున్నారా? దస్త్రాల నిర్వహణ ఎలా ఉంది? ఆసుపత్రిలో అన్నిటికీ అనుమతులున్నాయా? లేవా? క్షుణ్నంగా ఆ బృందం సభ్యులు పరిశీలించారు. నిబంధనలు పక్కాగా అమలు చేసినట్లు సంతృప్తి చెందారు. కేంద్రానికి నివేదిక పంపించారు. 91 శాతం అర్హతతో ఆసుపత్రి అర్హత సాధించింది. ఏడాదికి రూ.12 లక్షలు చొప్పున మూడేళ్ల పాటు నగదును కేంద్ర ప్రభుత్వం నజరానాగా అందించనుంది. ఆ నిధులతో ఆసుపత్రిని బలోపేతం చేయడంతో పాటు శిశువులకు కావాల్సిన అదనపు సౌకర్యాలను సమకూర్చుకోవచ్చు.


శ్రమకు తగిన ఫలితం

రవి, జిల్లా నాణ్యత ప్రమాణాల విభాగం అధికారి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం

జిల్లాలో తొలిసారిగా ముస్కాన్‌ కార్యక్రమం కింద జిల్లా మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఎంపికయ్యేందుకు కసరత్తు చేపట్టాం. అందులో విజయం సాధించాం. ఉత్తమ స్కోరింగ్‌ రావడంతో శ్రమకు తగిన ఫలితం దక్కినట్టయింది. సంతోషంగా ఉంది. ముఖ్యంగా నిబంధనల అమలు, అనుశీలనపై వైద్యులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాం. అందరి సహకారంతో ఈ గుర్తింపు దక్కింది. ఇదే స్ఫూర్తితో సేవలు బలోపేతం చేస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని