logo

హరిత లక్ష్యం మొక్కలు సిద్ధం!

పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీ నిర్వహణకు ప్రభుత్వం రూ.1.65 లక్షలు ఖర్చు చేస్తోంది.

Updated : 01 Jun 2023 04:37 IST

జిల్లాలో 50 లక్షలకు పైగా నాటేందుకు కార్యాచరణ

హనుమాన్‌నగర్‌ నర్సరీలో మొక్కలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌ : పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీ నిర్వహణకు ప్రభుత్వం రూ.1.65 లక్షలు ఖర్చు చేస్తోంది. వానాకాలం ఆరంభంలో ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటి సంరక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తొమ్మిదో విడత హరితహారాన్ని జూన్‌, జులైలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

పండ్ల రకాలకు ప్రాధాన్యం

జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 639 పల్లెల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) అమలవుతుంది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారానికి మొక్కలు సిద్ధం చేస్తున్నారు. అమీన్‌పూర్‌ మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదు. ఇక్కడ ఇతర నిధులు వెచ్చిస్తున్నారు. నర్సరీల్లో నిత్యం నీటి తడులు అందించడంతో పాటు.. ఎండకు ఎండిపోకుండా షెడ్‌ నెట్లు ఏర్పాటు చేశారు. పండ్ల మొక్కలు అధికంగా నాటేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. రావి, జామ, అల్ల నేరేడు, దానిమ్మ, నిమ్మ, బొప్పాయి, చింత, తుమ్మతో పాటు గుల్‌ మోహర్‌ తదితర 20 రకాల మొక్కలు పెంచుతున్నారు.

వచ్చే ఏడాదికి..

హరితహారం అమలులో భాగంగా వచ్చే ఏడాది(2024)కి ఇప్పటి నుంచే మొక్కల సంరక్షణకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 35,46,500 మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. ఈ ఏడాది నాటగా మిగిలిన వాటితో పాటు.. నర్సరీల్లో కొత్తగా సిద్ధం చేయనున్నారు.


 

ఖాళీ ప్రదేశాలు,  రహదారుల వెంట..

ఈ ఏడాది తొమ్మిదో విడత హరితహారం కింద జిల్లాలో 50,61,481 లక్షలు నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందుకోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో 7800కు పైగా నాటేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్రజలు ఇంటి ఆవరణలో నాటేందుకు పూలు, పండ్ల రకాలను ఆరు చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా భారీగా గ్రామాల్లో అంతర్గత రహదారులకు ఇరువైపులా, విద్యాసంస్థలు, చెరువులు, కుంటల కట్టలపైనా నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు ‘వృక్షమాల’ కార్యక్రమం కింద సింగూరు, మంజీరా, నల్లవాగు, నారింజ ప్రాజెక్టు సమీపం, పరీవాహక ప్రాంతాల్లో మొక్కలు నాటి పెంచనున్నారు. ‘సంపద వనమాల’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వసతి గృహాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మునగ, ఇతర తోటలు పెంచి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చూడనున్నారు.


విత్తనాలు మొలకెత్తకుంటే మళ్లీ నాటించాం

ప్రభుత్వం తొమ్మిదో విడత హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఇందుకోసం నర్సరీల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాం. తొలుత విత్తనాలు మొలకెత్తక పోవడంతో మళ్లీ నాటించాం. వాటి సంరక్షణకు వేసవిలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా నీడ కల్పించేలా షేడ్‌ నెట్‌లు పంపిణీ చేశాం. జూన్‌, జులై నెలల్లో నాటేందుకు సిద్ధం చేస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఏపీఓలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సాంకేతిక సహాయకుల పర్యవేక్షణలో మొక్కల సంరక్షణ కొనసాగుతుంది.

మణికుమార్‌, జిల్లా ప్లాంటేషన్‌ మేనేజర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని