logo

ప్రతిపాదనలకే పరిమితం

ఇది పోటీ ప్రపంచం. చదువు ఒక్కటే సరిపోదు. అదనపు అర్హతలు ఉంటేనే జీవితంలో స్థిరపడేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతోంది.

Updated : 01 Jun 2023 04:33 IST

ఇంటర్‌ కళాశాలల్లో అమలుకు నోచని ఎన్‌సీసీ

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ఇది పోటీ ప్రపంచం. చదువు ఒక్కటే సరిపోదు. అదనపు అర్హతలు ఉంటేనే జీవితంలో స్థిరపడేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌(ఎన్‌సీసీ)ని ప్రారంభించాలని రెండేళ్ల కిందట నిర్ణయించింది. జిల్లా అధికారులు ప్రతిపాదనలు సైతం పంపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు నేటి నుంచి మొదలు కానుండగా ఎన్‌సీసీ ప్రారంభంపై ఇప్పటి వరకు ఆదేశాలు అందని తీరుపై కథనం.

500 మంది కంటే ఎక్కువ ఉంటేనే..

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 8వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలల్లో ఎన్‌సీసీని ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపాలని 2021 ఆగస్టులో ఇంటర్‌బోర్డు జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌సీసీని ప్రారంభించాలంటే సంబంధిత ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 500కంటే ఎక్కువ ఉండటంతోపాటు అదే కళాశాలకు చెందిన ఓ రెగ్యులర్‌ అధ్యాపకుడు ఎన్‌సీసీ శిక్షణ పొందాలి. విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా జహీరాబాద్‌, సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల, నారాయణఖేడ్‌, కోహీర్‌, రామచంద్రాపురం కళాశాలల్లో ఎన్‌సీసీకి ప్రతిపాదించారు. రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.

విద్యార్థులకు ప్రయోజనం: పౌరులందరూ ఐక్యంగా ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుంటుంది. క్రమ శిక్షణ వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. లక్ష్యాల వైపు అడుగులు వేయిస్తుంది. అందుకే ఈ రెండింటినీ యువత వీడొద్దు. ఇదే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎన్‌సీసీని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలుంటుంది. విద్యార్థులు ఇంటర్‌ విద్య చదువుతూనే ఎన్‌సీసీలోనూ రాణించడం ద్వారా అదనపు ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే ఉన్నత విద్యలో చేరాలనుకునేవారు ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇంటర్‌లో ఎన్‌సీసీలో చేరిన వారు డిగ్రీలోనూ కొనసాగించేందుకు వీలుంటుంది. డిగ్రీ స్థాయిలో ఎన్‌సీసీని కోర్సుగా గుర్తించాలని యూజీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఇతర సబ్జెక్టుల మాదిరిగానే క్రెడిట్లు(మార్కులు) పొందేందుకు వీలుంటుంది. ఎన్‌సీసీ కేడెట్లకు ఇతర విద్యార్థులకంటే అధిక క్రెడిట్లు దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


ఇంటర్‌ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా..

ఇంటర్‌ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఎన్‌సీసీ ప్రారంభించేందుకు అర్హత ఉన్న కళాశాల వివరాలతో ప్రతిపాదనలు పంపించాం. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే ఎన్‌సీసీ తరగతులు ప్రారంభమవుతాయి. దేశభక్తిని చాటేందుకు విద్యార్థులకు ఎన్‌సీసీ వేదిక అవుతుంది. ఎన్‌సీసీ పూర్తిచేస్తే విద్యార్థులకు అదనపు అర్హతగా ఉంటుంది.

గోవిందరామ్‌, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు