logo

బడి.. చదువులమ్మ ఒడి

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కరసత్తు ఆరంభించింది. ఈ నెల 3 నుంచి 17వ తేదీ వరకు పల్లెలు, పట్టణాల్లో బడిబాట పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Published : 01 Jun 2023 01:19 IST

ఉపాధ్యాయుల చొరవ కీలకం
3 నుంచి 13 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

ర్యాలీలో పాల్గొన్న జడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కరసత్తు ఆరంభించింది. ఈ నెల 3 నుంచి 17వ తేదీ వరకు పల్లెలు, పట్టణాల్లో బడిబాట పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా కదలాలి. ప్రజాప్రతినిధులు, యువకులను కలుపుకొని ప్రచారం నిర్వహించాలి. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి.

నమోదు లక్ష్యం 10 వేలు

గతంలో నిర్వహించిన బడిబాట వైఫల్యాలపై విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఎక్కడ వెనుకబడ్డారో గుర్తించారు. విద్యార్థులు సర్కారు బడుల్లో చేరకపోవడానికి గల కారణాలపై దృష్టి సారించనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బడిబాటను ఎలా విజయవంతం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, తల్లిదండ్రుల సహకారంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయనున్నారు. కనీసం 10వేల మంది పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులను 1వ తరగతిలో చేర్పించాలి. ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారు ప్రాథమికోన్నత, అక్కడి వారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. నామమాత్రంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకుండా.. ప్రజల్లోకి వెళ్లేలా చూడాలి. ఈ దిశగా మండల విద్యాధికారులు దృష్టి సారించాలి.

ప్రైవేట్‌లో మొదలైన ప్రవేశాలు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇప్పటికే ప్రవేశాలు ఊపందుకున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం 15 వేలకు పైగా పిల్లలు ఈ బడుల్లో చేరినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నా.. ఉపాధ్యాయుల కొరత ఉండటం, సౌకర్యాలు తదితర కారణాలతో పిల్లలను చేర్చేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.

ప్రాథమిక పాఠశాలలపై దృష్టి

విద్యాశాఖ ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలపై దృష్టి సారించాలి. ఇక్కడి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ప్రవేశాలు ఎలా పెంచుకోవాలో అవగాహన కల్పించాలి. జిల్లాలోని 862 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా చేర్చేలా చూడాలి. ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి.


ప్రత్యేక శ్రద్ధ పెడతాం..

జిల్లాలో ఈ నెల 3 నుంచి 17వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నాం. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్చేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో బోధన, కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించాలి. ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సహకారం తీసుకోవాలి. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం అవుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు.

వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని