logo

పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి

సిద్దిపేట ప్రగతిపై ప్రతి ఒక్కరు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని, పదేళ్లలో వందేళ్ల అభివృద్ధిని చేసి చూపామని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 01 Jun 2023 01:19 IST

ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేట ప్రగతిపై ప్రతి ఒక్కరు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని, పదేళ్లలో వందేళ్ల అభివృద్ధిని చేసి చూపామని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇంట్లో పెళ్లి మాదిరిగా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని సిద్దిపేట నియోజకవర్గంలో జూన్‌ 2 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రంగమేదైనా పదేళ్లలో గుణాత్మక మార్పును సాధించామన్నారు. దాని వెనుక తీవ్రమైన ప్రయత్నం, కృషి ఉందన్నారు. నాటితో పోల్చితూ నేటి ప్రగతిని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గోదావరి నీళ్లు దరిచేరాయని, సిద్దిపేట జిల్లా, సుడా, వైద్య కళాశాల, జాతీయ రహదారి, రింగు రోడ్డు, రైలు మార్గం ఏర్పాటు, తదితర ఎన్నో వాటిని సాకారం చేసుకున్నట్లు వివరించారు. ఈ ప్రాంతం అభివృద్ధికి అధ్యయన కేంద్రంగా మారిందని, కేరళ నుంచి ఈ నెల 11, 12 తేదీల్లో అక్కడి  పురపాలిక అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటనకు రానున్నారని తెలిపారు. పదేళ్ల కిందట జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగయ్యేదని, నేడు ఆ సంఖ్య 7 లక్షలకు చేరిందన్నారు. చెల్లింపులు రూ.33 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందన్నారు.

ఇంకా వరి కోతలా!

నిజామాబాద్‌, సూర్యాపేట, హుజూరాబాద్‌ ఇతర ప్రాంతాల్లో కోతలు, కొనుగోళ్లు పూర్తయ్యాయని, జిల్లాలో మాత్రం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కోతలు జరగకపోవడం శోచనీయమన్నారు. ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని, సకాలంలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యమం, అభివృద్ధితో పాటు మార్పులోనూ ముందుండాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలు అంచనా ఉందన్నారు. జూన్‌ 9న కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇచ్చే కార్యక్రమాన్ని, అర్హులకు ఇళ్ల పట్టాలు, రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంపై ఆయా మండలాల బాధ్యులను మంత్రి మందలించారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, బల్దియా అధ్యక్షురాలు మంజుల, కమిషనర్‌ సంపత్‌కుమార్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం తదితరులు ఉన్నారు.

* దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముద్రించిన ప్రచార గోడపత్రికలను మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి బుధవారం గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆవిష్కరించారు. ఆటోడ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాగర్ల బాలరాజు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని