logo

రాష్ట్ర సాకారంతోనే ప్రజా సంక్షేమ పథకాలు

తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం వల్లే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

Published : 02 Jun 2023 01:55 IST

మల్యాలలో మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం వల్లే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నారాయణరావుపేట మండలం మల్యాల, జక్కాపూర్‌, మాటిండ్ల గ్రామాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో 7 గంటల పాటే వ్యవసాయ రంగానికి విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. ఔరంగాబాద్‌, నాందేడ్‌ ప్రాంతాల్లో ఆరు రోజులకోసారి తాగునీరు వస్తూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. 16 రాష్ట్రాల్లో మహిళలు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారని, ఒక్క తెలంగాణలో మాత్రమే వారికి రూ.2 వేల పింఛన్‌ ఇస్తున్నామని తెలిపారు. మల్యాలలో వేడుక మందిరం, గ్రంథాలయం, అంగన్‌వాడీ భవనం, ఓపెన్‌ జిమ్‌, జక్కాపూర్‌లో కూరగాయల మార్కెట్‌, మాటిండ్లలో రెండు పడక గదుల నిర్మాణం, విద్యుత్తు ఉపకేంద్రం తదితర కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన మంత్రి చేశారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి: హరీశ్‌రావు

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి సంస్థ కార్మికులు శాయశక్తులా కృషి చేస్తున్నారని, వారికి మేలు చేయాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట - సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఏడు నూతన డీలక్స్‌ బస్సు సర్వీసులను, ఆర్టీసీ డిపోలో గురువారం ఆర్‌ఎం సుదర్శన్‌తో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నూతన సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఆర్‌ఎం సుదర్శన్‌ ప్రయాణికులకు పూలు అందజేశారు. ఆర్డీసీ డిపో మేనేజర్‌ సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* అంతర్జాతీయ ప్రమాణాలతో ఐదు వరుసల అథ్లెటిక్‌ రన్నింగ్‌ ట్రాక్‌, సింథటిక్‌ టర్ఫ్‌ ఏర్పాటుతో సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల రూపురేఖలు మారనున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందన్నారు. క్రీడాప్రాంగణం పనులను గురువారం ఆయన పరిశీలించారు.

* సిద్దిపేటలో రైలు ట్రయల్‌ రన్‌ పంద్రాగస్టు లోపు ఉంటుందని మంత్రి.. మందపల్లి రైల్వే పనులను పరిశీలించిన అనంతరం తెలిపారు.

* జూన్‌ 3న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు జన్మదినం పురస్కరించుకుని శ్రేయోభిలాషి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో 138 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు క్రికెట్‌ కిట్లు క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని