దిశ తిరిగి.. దశ మారి..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తొమ్మిదేళ్లలో జిల్లా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది. సాగు, తాగునీటి రంగాలతోపాటు, విద్య, వైద్యంలో పురోగతి సాధించింది. ప్రజారవాణా మెరుగు పడింది. జాతీయ రహదారులు, గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణంతో ఇబ్బందులు తీరాయి.
మెతుకు సీమకు మహర్దశ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తొమ్మిదేళ్లలో జిల్లా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది. సాగు, తాగునీటి రంగాలతోపాటు, విద్య, వైద్యంలో పురోగతి సాధించింది. ప్రజారవాణా మెరుగు పడింది. జాతీయ రహదారులు, గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణంతో ఇబ్బందులు తీరాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జిల్లాపై ‘న్యూస్‌టుడే’ అవలోకనం.
న్యూస్‌టుడే,మెదక్
మెరుగైన ప్రజారవాణా
గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం ఏర్పడింది. కంకర రోడ్లను తారుగా మార్చారు. గండిమైసమ్మ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ పట్టణం వరకు రూ.425 కోట్లతో 765(డి)జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. సంగారెడ్డి-నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారి జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ నుంచి పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ వరకు 26 కిలోమీటర్ల విస్తరణ పనులు నిర్వహించారు. ఇక మెదక్ నుంచి ఎల్కతుర్తి వయా సిద్దిపేట మీదుగా చేపట్టే జాతీయ రహదారి 765(డిజీ) పనులు ఇటీవల మొదలయ్యాయి. రూ.882 కోట్లతో మెదక్ నుంచి సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి వరకు విస్తరించనున్నారు.
పరిశుభ్రతకు..
పంచాయతీలకు ప్రతినెలా పల్లెప్రగతి ద్వారా, పురపాలికలకు పట్టణ ప్రగతి నిధులు అందుతున్నాయి. గ్రామాల్లో వైకుంఠధామం, డంప్‌యార్డు నిర్మించగా, ట్రాక్టర్, ట్యాంకర్ అందజేయడంతో పారిశుద్ధ్యం మెరుగైంది. పురపాలికల్లో సమీకృత మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణానికి నిధులు కేటాయించారు.
పర్యాటకం ఆహ్లాదం
మెతుకుసీమ పర్యాటకానికి పెట్టింది పేరు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి మెదక్‌లో ఉంది. కాకతీయులు పరిపాలించిన ఖిల్లా, ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, సమీపంలోనే నిజాంకాలంలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం వన్యప్రాణి అభయారణ్యం, పోచారం ప్రాజెక్టుల వద్ద సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ నెలకొంటోంది. నర్సాపూర్ పట్టణంలో అర్బన్‌పార్కు, వడియారం, మనోహరాబాద్, పరికిబండలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేసింది.
అతివలకు అండగా..
ఆకతాయిల వేధింపుల నుంచి మహిళలు, విద్యార్థినులను రక్షించేందుకు పోలీస్‌శాఖ షీటీంలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు భరోసా, సఖి కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2019 సెప్టెంబర్ 1న సఖి కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 855 అవగాహన సదస్సులు నిర్వహించారు. మొత్తం 855 కేసులు రాగా 91 కేసులలో రాజీ కుదిర్చారు.
విద్య బలోపేతం
గిరిజన గురుకులాలు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి ఏటా రూ.1.20 లక్షలు వ్యయం చేస్తోంది. పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలలు సైతం అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఆంగ్లమాధ్యమ బోధనతో పాటు మధ్యాహ్నభోజనం, దుస్తులు, పుస్తకాలను ఉచితంగా ఇవ్వడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మనబడి కార్యక్రమం పేరిట బలోపేతం చేస్తున్నాయి.
డిగ్రీ కళాశాలలు -4 జూనియర్ -16 పాలిటెక్నిక్ -3
ప్రభుత్వ -936 గురుకుల -29
చేరువలో పాలన
పరిపాలన వికేంద్రీకరణకు కొత్త జిల్లాలు ఆవిర్భవించగా, ప్రభుత్వం వాటిల్లో నూతన మండలాలను ఏర్పాటు చేసింది. 2016 అక్టోబరు 11న మెదక్ కేంద్రంగా ఇరవై మండలాలతో జిల్లా ఆవిర్భవించింది. ఇందులో 15 మండలాలు పాతవి, అయిదు నూతనంగా ఏర్పాటయ్యాయి. అనంతరం వెల్దుర్తి, చేగుంటలోని గ్రామాలను కలుపుతూ మాసాయిపేట మరో మండలంగా ఏర్పాటయింది. 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయగా, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట పురపాలికలుగా ఆవిర్భవించాయి.
చివరి ఆయకట్టుకు నీళ్లు
జిల్లాలో ఘనపూర్ ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్. నిజాం కాలంలో నిర్మించిన ఈ జలాశయానికి పెద్దఎత్తున నిధులు కేటాయించారు. వీటితో కాలువల ఆధునికీకర¢ణతోపాటు, వివిధ పనులు చేపడుతున్నారు. ప్రాజెక్టుకు చెందిన మహబూబ్‌నహర్(ఎంఎన్), ఫతేనహర్(ఎఫ్‌ఎన్) కాలువలకు రూ.97.9 కోట్లు మంజూరయ్యాయి. 43.64 కిలోమీటర్ల ఎంఎన్ కాలువ పనులు పూర్తికావొచ్చాయి. 12.8 కిలోమీటర్ల ఎఫ్‌ఎన్ పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు ఎత్తు పెంపునకు రూ.43.60 కోట్లు మంజూరయ్యాయి.
చెక్‌డ్యాంల నిర్మాణం...
మంజీరా నదిపై9 , హల్దీపై ఆరు చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పనులు పూర్తికావొచ్చాయి. హల్దీపై పూర్తికాగా, మంజీరాపై కొన్ని తుదిదశలో ఉన్నాయి. వీటి నిర్మాణంతో భూగర్భజలాలు వృద్ధిచెందాయి. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో నాలుగు విడతల్లో 1,870 చెరువుల్లో పనులు చేపట్టారు. ఇందుకు రూ.445 కోట్లను వెచ్చించారు. పూడికతీతతో ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది.
కాళేశ్వరం..
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజి 17,18,19 పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొండపోచమ్మసాగర్ నుంచి కాలువలు పూర్తిచేశారు. గత మార్చిలో కాళేశ్వరం జలాలను విడుదల చేయడంతో, చేగుంట, రామాయంపేట మండలాల్లోని పలు చెరువులను నింపారు.
అందుబాటులో వైద్యం
కేసీఆర్ కిట్ ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు సంఖ్య పెరిగింది. మెదక్‌లో రూ.17 కోట్లతో మాతాశిశుసంరక్షణ కేంద్రం అందుబాటులోకి రాగా, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో రక్తశుద్ధి, ఐసీయూ, రేడియాలజీ అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సేకరించే నమూనాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, నివేదికలు అందజేసేందుకు మెదక్‌లో డయోగ్నోస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 131 పల్లె దవాఖానాలు ఏర్పాటయ్యాయి. ‘కంటివెలుగు’ ద్వారా పరీక్షలను నిర్వహించి ఉచితంగా అద్దాలను పంపిణీ చేస్తున్నారు.
పారిశ్రామికీకరణ వైపు అడుగులు
మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట మండలాల్లో పరిశ్రమలున్నాయి. ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా అనుమతులను సులువు చేయడంతో కొత్త కంపెనీలు ఏర్పాటై పలువురికి ఉపాధి లభిస్తోంది. మనోహరాబాద్‌లో ఐటీసీ సంస్థ రూ.890 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసింది.
నెరవేరిన కల
జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి గతేడాది ఆగస్టు 1న రేక్ పాయింట్, సెప్టెంబర్ 23న మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైల్వేసేవలు మొదలయ్యాయి. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ముథ్కేడ్ వరకు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉంది. ఈ మార్గంలో ఇప్పటివరకు డీజిల్‌తో నడిచే రైళ్లు మాత్రమే పరుగులు పెడుతుండేవి. కొత్తగా ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు చేపట్టి పూర్తిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు
-
Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు