logo

దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పదేళ్లలో జిల్లాలో జరిగిన ప్రగతిని పల్లెల్లో వివరించేందుకు కార్యాచరణ రూపొందించారు.

Published : 02 Jun 2023 01:55 IST

కలెక్టరేట్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షిషా

మెదక్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పదేళ్లలో జిల్లాలో జరిగిన ప్రగతిని పల్లెల్లో వివరించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఆయా శాఖల ద్వారా సాధించిన విజయాలను తెలియజేసేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించనున్న వేడుకలను పకడ్బందీగా చేపట్టేందుకు ఆయా శాఖల అధికారులకు మండల, జిల్లా స్థాయిలో బాధ్యతలను అప్పగించారు. పాలనాధికారి రాజర్షిషా పలు మార్లు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులతో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్‌లో సమీకృత కలెక్టరేట్‌, మున్సిపల్‌, పోలీస్‌స్టేషన్‌, ఖిల్లాను విద్యుత్తుదీపాలతో అలంకరించారు.

ముఖ అతిథిగా మంత్రి తలసాని

స్థానిక కలెక్టరేట్‌లో జరిగే వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చిన్నశంకరంపేటలోని అమరు వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 9గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి రాకను పురస్కరించుకొని పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, ఇన్‌ఛార్జీ ఎస్పీ సింధుశర్మ గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.

దళితబంధు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

పాపన్నపేట: ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పాలనాధికారి రాజర్శిషా అన్నారు. గురువారం మండల పరిధి పొడ్చన్‌పల్లి తండా వద్ద దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసుకున్న అబ్లాపూర్‌ గ్రామానికి చెందిన కిష్టయ్య సిమెంటు దుకాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కొల్చారం: ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని పాలనాధికారి రాజర్షిషా అన్నారు. గురువారం కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి రైతు వేదికలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సదర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ వేదిక పరిసరాలు శుభ్రపరచాలని, వేదికను అలంకరించాలని సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని