logo

దర్జాగా స్వాహా

చెరువులు, కుంటలు కనిపిస్తే చాలు రియల్టర్లు, భూస్వాములు, పరిశ్రమల యాజమాన్యాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 06 Jun 2023 00:58 IST

చెరువులు, కుంటల భూములు అన్యాక్రాంతం

మాసాయిపేటలోని మైసమ్మ చెరువు

న్యూస్‌టుడే, వెల్దుర్తి (మాసాయిపేట): చెరువులు, కుంటలు కనిపిస్తే చాలు రియల్టర్లు, భూస్వాములు, పరిశ్రమల యాజమాన్యాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 44వ జాతీయ రహదారిలో ఉండే మాసాయిపేట మండలంలో చెరువులు, కుంటల భూములు కబ్జాకు గురవుతుండటం గమనార్హం. కబ్జా అయిన శిఖం భూములు ఎకరా రూ.కోటి విలువ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

ఫిర్యాదు చేస్తున్నా..

మాసాయిపేట మండల కేంద్రం 44వ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో విద్యుత్తు ఉపకేంద్రం వెనుక భాగంలో కోరింత కుంట ఉంది. ఈ కుంట కింద 30 ఎకరాల ఆయకట్టు ఉంది. మత్తడి పక్కనే ఉన్న ఓ పరిశ్రమ వారు దర్జాగా కుంట మత్తడిని, శిఖం భూమిని దాదాపు రెండు ఎకరాలు కబ్జా చేసి సిమెంట్‌ పలకలతో చుట్టూ గోడను నిర్మించారు. ఈ కుంట నిండి మత్తడి పారితే నీళ్లు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేదు. కబ్జా చేసిన శిఖం భూమిలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు. కొంత భాగంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఎకరా భూమి రూ.కోటి విలువ చేస్తుంది. కబ్జా విషయమై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు గత పదేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే వారులేరని మాసాయిపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరుద్ధరణ పట్టించుకోక..

మాసాయిపేట గ్రామ పరిధిలో ఏళ్ల క్రితం శిథిలమైన కోటమైసమ్మ చెరువు పునరుద్ధరణను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న శిఖంలో చాలా భాగం కబ్జాకు గురైంది. కొందరు స్థిరాస్తి వ్యాపారులు తోటలు పెంచుతున్నారు. చెరువు ఆయకట్టు కాలువను గోశాల పరిసరాల్లో గల ఓ వెంచర్‌ యజమాని సుమారు ఎకరాల విస్తీర్ణంలో కబ్జా చేసి తారు రోడ్లు, ప్లాట్లు చేయడంతో పాటు చుట్టూ గోడ నిర్మించారు. ఇక్కడ ఎకరా రూ.కోటి ధర పలుకుతోంది. తగు చర్యలు తీసుకొని చెరువును పునరుద్ధరించాలని మాసాయిపేట, లింగారెడ్డిపల్లి గ్రామస్థులు విన్నవిస్తున్నారు.

అడ్డుగా గోడ నిర్మాణం

మాసాయిపేట మండలంలోనే అతి పెద్దదైన రామప్ప చెరువు 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. చెరువు మత్తడికి ఎదురుగా బఫర్‌ జోన్‌లో ఓ తోట యజమాని సిమెంట్‌ పలకలతో గోడ నిర్మించారు. దీనివల్ల మత్తడిపై నుంచి పారే నీటికి అడ్డంకులు ఏర్పడి చెరువుకే ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి, రైల్వేలైన్‌ సైతం మునిగే అవకాశం లేకపోలేదు. గోడను నీటి పారుదలశాఖ అధికారులు పరిశీలించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వర్షాకాలం ప్రారంభం కాకముందే కబ్జాదారులపై చర్యలు తీసుకుని జలవనరుల భూములను స్వాధీనం చేసుకోవాలని, కట్టడాలను కూల్చాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కోరింత కుంట శిఖాన్ని కబ్జా చేసి నిర్మించిన గోడ

చర్యలు తీసుకుంటాం

మాసాయిపేట మండలంలోని రామప్ప చెరువు, మైసమ్మ చెరువు, కోరింత కుంటలతో పాటు ఇతర చెరువులు, కుంటలను త్వరలోనే తహసీల్దార్‌ కార్యాలయ సర్వేయర్‌, నీటి పారుదల సర్వేయర్‌తో సంయుక్త సర్వే చేయిస్తాం. కబ్జాదారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కబ్జాకు గురైన శిఖం భూములను, బఫర్‌ జోన్‌ భూములను, కాలువల భూములను స్వాధీనం చేసుకుంటాం.

రాజేందర్‌రావు, నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ, వెల్దుర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని