logo

రైలు పట్టాలపై రెండు మృతదేహాలు

తూప్రాన్‌ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లి వద్ద సోమవారం రైలు పట్టాలపై వంద మీటర్ల దూరంలో రెండు మృతదేహాలు పడిఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Published : 06 Jun 2023 01:17 IST

కారణాలు వేరు.. ఘటనా స్థలి దాదాపు ఒకటే

తూప్రాన్‌, న్యూస్‌టుడే: తూప్రాన్‌ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లి వద్ద సోమవారం రైలు పట్టాలపై వంద మీటర్ల దూరంలో రెండు మృతదేహాలు పడిఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇరువురు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గుర్తించినా, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఏడాది కిందట తమ్ముడు.. ప్రస్తుతం అన్న

యాదగిరి

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అంతటితో ఆగకుండా ఏడాది వ్యవధిలో అన్నదమ్ములను బలిగొన్నాయి. ఇద్దరూ దూరం కావడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కామారెడ్డి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తూప్రాన్‌ పురపాలికలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఇప్పలపల్లి యాదగిరి(40), లక్ష్మీ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులతో గొడవపడిన యాదగిరి బ్రాహ్మణపల్లికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసవడం, ఆర్థిక ఇబ్బందులతో యాదగిరి సోదరుడు నర్సింలు సైతం ఏడాది క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో, 14 నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సోదరుడి వైద్య ఖర్చులు భారమై..

నీరుడి ప్రవీణ్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్న ప్రాణాలను దక్కించుకునే క్రమంలో చికిత్సకు అయిన ఖర్చులు భారమై తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. కామారెడ్డి రైల్వే పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన నీరుడి నవీన్‌ తూప్రాన్‌లోని వెంకటాపూర్‌ శివారులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్‌, ప్రవీణ్‌(22)ది ఉమ్మడి కుటుంబం. అన్న వైద్యానికి రూ.4 లక్షల వరకు ఖర్చయింది. అన్నను ఢీకొన్న వాహనం ఆచూకీ లభించక సోదరుడు కలత చెందాడు. ఆర్థిక సమస్యలూ తోడవడంతో మానసికంగా కుంగిపోయిన ప్రవీణ్‌ ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బ్రాహ్మణపల్లి రైల్వేగేట్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం ప్రాంతంలో ఆ మృతదేహం ప్రవీణ్‌దిగా గుర్తించారు. పెద్ద కొడుకు తీవ్ర గాయాలతో మంచానికి పరిమితం కాగా చేతికొచ్చిన చిన్న కొడుకు దూరం కావడంతో తల్లి నర్సమ్మ గుండెలవిసేలా రోదించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని