logo

ధాన్యం బకాయిలు రూ.344.69 కోట్లు

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో పలుమార్లు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో నష్టపోక తప్పలేదు.

Published : 07 Jun 2023 01:34 IST

ఖాతాల్లో జమకాక రైతుల ఆందోళన
న్యూస్‌టుడే, మెదక్‌, శివ్వంపేట, పాపన్నపేట

శివ్వంపేట మండలం చెన్నాపూర్‌ కేంద్రంలో ధాన్యం

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో పలుమార్లు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో నష్టపోక తప్పలేదు. మిగిలిన ధాన్యాన్ని విక్రయించగా అందుకు సంబంధించిన డబ్బు ఖాతాల్లో జమకాక ఆందోళనకు గురవుతున్నారు. పంట విక్రయించాక 72 గంటల్లో ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉండగా, రోజులు గడుస్తున్నా ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సివస్తోంది.

యాసంగిలో పండించిన ధాన్యంలో 3.51 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 407 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, అందులో 2.48 లక్షల టన్నుల మేర మిల్లులకు పంపించారు. కొనుగోళ్లు పూర్తవడంతో ఇప్పటి వరకు 136 కేంద్రాలు మూసివేశారు.

57102 మంది నుంచి..

జిల్లాలో ఇప్పటి వరకు 57,102 మంది రైతుల నుంచి రూ.528.86 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు చేరాక, అక్కడ ట్రక్‌షీట్‌ ప్రకారం ధాన్యం వచ్చింది, లేనిది పరిశీలిస్తారు. ఆ తర్వాత కేంద్రం నిర్వాహకులు ట్యాబ్‌లో వివరాలు నమోదు చేస్తారు. మిల్లరు పరిశీలించి ఆమోదం తెలపగానే పౌరసరఫరాల సంస్థకు సమాచారం చేరుతుంది. అనంతరం రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. 2.56 లక్షల టన్నులకు సంబంధించి 2.10 లక్షల టన్నుల (81.87 శాతం) మేర వివరాలు ట్యాబ్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ వేగంగానే జరుగుతున్నా అన్నదాతల ఖాతాల్లో మాత్రం డబ్బు ఆలస్యంగా జమవుతోంది.

మిన్‌పూర్‌లో తూకం

రూ.184.17 కోట్లు మాత్రమే..

ఇప్పటి వరకు 89,401 టన్నులకు సంబంధించి 26,778 మంది రైతుల ఖాతాల్లో రూ.184.17 కోట్లు మాత్రమే జమయ్యాయి. తాజాగా ప్రభుత్వం కొంతమేర విడుదల చేయగా పలువురికి చేతికందాయి. ఇంకా 30,324 మందికి రూ.344.69 కోట్ల మేర అందాల్సి ఉంది. ధాన్యం విక్రయించాక 72 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమవుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నా అది అమలుకు నోచుకోలేదు. మరి కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. దుక్కులు దున్ని, నాట్లు వేసేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతారు. ఎరువులు, విత్తనాలు కొనే సమయం ఇది. నగదు చేతికందక ఆందోళన చెందుతున్నారు.


20 రోజులైనా..

శేఖర్‌గౌడ్‌, పాపన్నపేట

రెండెకరాల్లో వరి సాగు చేయగా, 22.80 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. వాటిని తూకం వేయగా, గత నెల 17న మిల్లుకు తరలించారు. రూ.47 వేలు ఖాతాలో ఇంకా జమకాలేదు. 72 గంటల్లో జమచేస్తామని ప్రకటించగా అమలుకు నోచడం లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించాలి.


ఎదురుచూపులే..

నగేశ్‌, చండి

32 క్వింటాళ్ల ధాన్యాన్ని గత నెల 13న కేంద్రంలో విక్రయించాను. నగదు జమకాక ఎదురుచూపులు తప్పడం లేదు. సకాలంలో చెల్లిస్తేనే మాలాంటి వారికి ఉపయోగం ఉంటుంది. వానాకాలం సీజన్‌ మొదలవుతున్న తరుణంలో వెంటనే జమయ్యేలా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని